భారతదేశం స్వాతంత్య్రం పొంది వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి సరికొత్త భారత్‌ను నిర్మించేందుకు దేశం విస్తృత మార్గసూచీని సిద్ధం చేస్తుందన్న నమ్మకం తనకుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం 75 వారాల ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన 'దండి పాదయాత్ర' ముగింపు కార్యక్రమం మంగళవారం దండిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
"1947 నుంచి మన స్వాతంత్య్ర సమరయోధుల అడుగుజాడల్లోనే మనం నడిచాం. 'సబ్ కా సాథ్.. సబ్‌కా వికాస్' (అందరితో కలిసి.. అందరి అభివృద్ధి) అన్నది మన నినాదం. మనం చాలా అంశాలను సాధించాం. 75 ఉపాయాలు, 75 విజయాలు, 75 చర్యలు, 75 పరిష్కారాలు మన లక్ష్యం కావాలి"
-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి
ఈ రోజు ప్రపంచం మొత్తం మన బలాలను గుర్తించిందని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు.