దేశరాజధాని దిల్లీలో పరిస్థితులు రోజురోజుకీ దయనీయంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు శ్మశానాల్లో చితి పేర్చడానికి స్థలం దొరక్క ఇబ్బందులు పడుతున్న దిల్లీ వాసులు ఇప్పుడు ఆప్తుల భౌతికకాయాలను కాల్చడానికి కట్టెలు సైతం దొరకని దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లెక్కకు మించిన భౌతికకాయాలు మరుభూములకు వరుస కడుతుండడంతో కాటికాపరులు సైతం చేతులెత్తేస్తున్నారు. దాంతో కుటుంబసభ్యులే అక్కడ ఇక్కడ కట్టెలు సమకూర్చుకుని, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ చితులు పేర్చి దహన సంస్కారాలు పూర్తిచేయాల్సి వస్తోంది.
దిల్లీలో అతిపెద్ద నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటికలో ఏప్రిల్ 1-23 తేదీల మధ్య 2,526 మందిని దహనం చేసినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇందుకోసం 8,000 క్వింటాళ్లకుపైగా కలపను ఉపయోగించారు. ఇప్పటివరకు ఈ కలప అంతా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చేది. ఇప్పుడు అక్కడ కూడా దహన సంస్కారాలు పెరిగిపోవడంతో అధికారులు ఆర్డర్లు తీసుకోవడం మానేశారు. దాంతో హరియాణా అటవీశాఖను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్‌కు రూ.450 లెక్కన 7వేల క్వింటాళ్ల కలప అందించడానికి వారు అంగీకరించారు. అంతకుమించి సరఫరా చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు నానాటికీ డిమాండ్ పెరిగిపోతుండటంతో క్వింటాల్‌కు రూ.750 పెట్టినా బయట కలప దొరకని పరిస్థితి నెలకొన్నట్లు దిల్లీ శ్మశానవాటికల్లో అంత్యక్రియలను పర్యవేక్షించే అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చితులు పేర్చేందుకు అవసరమైన కర్రలనుకూడా నల్లబజారు (బ్లాక్‌మార్కెట్)లో కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కలప కొరతను ఎదుర్కోవడానికి ఆవు పిడకలను ఉపయోగించాలని తూర్పు దిల్లీ నగరపాలక సంస్థ ఉత్తర్వులు జారీచేసింది.
వెయ్యి దహన సంస్కారాలకు ఏర్పాట్లు..