World Tallest Temple : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్ అహ్మదాబాద్‌లో రూపొదిద్దుకుంటోంది. ఈ అత్యంత ఎత్తైన ఈ ఆలయాన్ని జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విశ్వ ఉమియా ధామ్ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం పాటీదార్ సమాజానికి చెందిన ట్రస్టు సభ్యులు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ నిర్మాణ శైలిపై చర్చించారు.
Umiya Mata Temple Ahmedabad : సుమారు 504 అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఈ గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇండో-జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలు, వరదలను సైతం తట్టుకుని ఉండేలా దీని నిర్మాణం చేస్తున్నారు. 504 అడుగుల ఎత్తున్న ఈ ఆలయంలో 270 అడుగుల వద్ద గ్యాలరీ పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. ఉమియా మాతాజీ విగ్రహంతో పాటు పరానా శివలింగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ ఆలయానికి వచ్చే పర్యటకుల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 3,500 వాహనాలు ఏకకాలంలో పార్క్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద పార్కింగ్ ప్రదేశం అవుతుందని నిర్వాహకులు చెప్పారు.
"ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది కేవలం పాటీదార్ సమాజానికి చెందినది మాత్రమే కాదు. ప్రతి సమాజానికి ఈ దేవాలయం చెందుతుంది. నిర్మాణం అనంతరం ఈ గుడి.. పర్యటక ప్రాంతంగా మారుతుంది. కేవలం గుజరాత్, భారత్‌లోని భక్తులే కాకుండా ప్రపంచంలో ఉన్న పర్యటకులు.. ఈ గుడిని చూసేందుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులకు ఇది గమ్యం కానుంది. ఈ ఆలయం భవిష్యత్తులో కొత్త వింతగా మారినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు."
-ఆర్పీ పటేల్, విశ్వ ఉమియా ధామ్ అధ్యక్షుడు