ప్రపంచంలోనే అతి చిన్న హార్మోనియంను తయారు చేసి రికార్డు సృష్టించాడు రాజస్థాన్ చురు ప్రాంతానికి చెందిన అశోక్ ఆర్య. తన తమ్ముడి కుమారునికి సంగీతం నేర్పించేందుకు చేసిన ఈ వాద్యం.. చూడడానికి చిన్నదిగా ఉన్నా, సప్త స్వరాలను ఘనంగా పలికిస్తోంది. కేవలం ఈ చిన్న హార్మోనియాన్ని మాత్రమే కాకుండా చెక్క వ్యర్థాలతో మరెన్నో కళాకండాలను తయారు చేసి కళ పట్ల తన మక్కువను చాటుకుంటున్నారు.
హార్మోనియం ప్రత్యేకత ఏంటి?
సాధారణంగా హార్మోనియంకు రెండు, మూడు రీడ్ సెట్లు ఉంటాయి. కానీ ఈ చిన్న దానిలో మాత్రం ఆరు రీడ్ సెట్లు ఏర్పాటు చేసినట్లు అశోక్ ఆర్య తెలిపారు. ఈ వాద్యం 9 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పుతో 5 అంగుళాల ఎత్తుతో రూపొందించారు. ఆ హార్మోనియం రూపొందించేందుకు ఆర్యకు రెండు నెలలు పట్టిందని తెలిపారు. అతి చిన్న హార్మోనియంను రూపొందించినందుకు గానూ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు.
"మా తమ్ముడి కుమారునికి రెండేళ్లు ఉంటాయి. వాడి చిట్టి చిట్టి వేళ్లకు సరిపడే వాద్యాన్ని తయారు చేయాలని అనుకున్నా. అందుకు సంబంధించిన చిన్న రీడ్ సెట్‌ను స్వయంగా రూపొందించాను. ఇందులో మొత్తం స్వదేశీ పరిజ్ఞాన్ని మాత్రమే ఉపయోగించాను. కలపతో పాటు ఇత్తడితో ఈ సంగీత పరికరం తయారైంది."