తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్​! - ఐవరీ మ్యాంగో

మధ్యప్రదేశ్ జబల్​పుర్​లో ఓ రైతు 28 రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. ఇందులో దేశ విదేశాలకు చెందిన అత్యంత ఖరీదైన వెరైటీలున్నాయి. అందుకే ఏకంగా 15 శునకాలు, నలుగురు సిబ్బందితో తోటకు పహారా కాస్తున్నారు. ఇక్కడ పండే మియాజాకి మామిడి పండ్లు కిలో రూ.2.70 లక్షలంటే ఈ తోట ఎంత ఖరీదైనదో అర్థం చేసుకోవచ్చు.

Jabalpur mangoes
మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్​!

By

Published : Apr 13, 2022, 6:43 PM IST

Updated : Apr 13, 2022, 8:31 PM IST

మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్​!

Jabalpur Mangoes: ఆ మామిడి తోటలోకి వెళ్లిన వారు కనీసం సెల్ఫీలు కూడా తీసుకోవడానికి వీల్లేదు. కాయలను ముట్టుకోకూడదు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన మామిడి రకాలను పండిస్తున్న ఈ తోటకు పహారా కాసేందుకు 12 విదేశీ జాతుల శునకాలు సహా మూడు దేశీయ జాతుల శునకాలను మోహరించారు యాజమాని. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు మామిడి కాయలు చోరీకి గురికాకుండా ఉండేందుకు నలుగురు సిబ్బంది 24 గంటలపాటు డేగ కళ్లతో చూస్తుంటారు.

జబల్​పుర్ మామిడి తోట

Miyazaki Mangoes: ఇంత భారీ వ్యయంతో మామిడి పండ్లను సాగుచేస్తున్న రైతు పేరు సంకల్ప్ సింగ్ పరిహార్​. మధ్యప్రదేశ్ జబల్​పుర్​కు 25 కిలోమీటర్ల దూరంలో నానాఖేదా ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వర్​ హైబ్రిడ్ ఫాం హౌస్ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పండే మామిడి రకాలు దేశంలో మరెక్కడా ఉండవు. జంబో గ్రీన్​ మ్యాంగోగా పిలిచే 'తలాల గిర్ కేసర్'​ సహా నేపాల్​ రకం కేసర్​ బాదం మ్యాంగో, చైనాకు చెందిన ఐవరీ మ్యాంగో, అమెరికా ఫ్లోరిడాలో పండించే మాంగిఫెరా టామీ ఆట్కిన్స్​ రకాల మామిపండ్లను ఇక్కడ పండిస్తారు. అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటైన ఈ ఫ్లోరిడా మ్యాంగోను 'బ్లాక్​ మ్యాంగో' అని కూడా పిలుస్తుంటారు. ​ఇక ఈ తోటలోనే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక మామిడి రకం మియాజాకి. జపనీస్ ఎగ్​ప్లాంట్ అని కూడా పిలిచే ఈ రకం మామిడి పండ్ల ధర కిలో ఏకంగా రూ.2.70లక్షలు. ఇలా మొత్తం 8 విదేశాలకు చెందిన మామిడి రకాలు సహా భారత్​కు చెందిన 20 రకాలను సంకల్ప్​ పరిహార్​ సాగు చేస్తున్నారు. అంత విలువైనవి కాబట్టే తోటకు భారీ వ్యయంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జబల్​పుర్ మామిడి తోటకు శునకాలతో కాపలా

Black Mango in Jabalpur: మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకం అంటున్నారు సంకల్ప్​. జపాన్​లోని మియాజాకి రాష్ట్రంలో పండే ఈ రకానికి ఆ ప్రాంతం వల్లే ఈ పేరు వచ్చినట్లు చెప్పారు. భారత్​లోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు వీటిని సాగు చేస్తున్నట్లు తెలిపారు. బ్లాక్​ మ్యాంగో ఎంతో ఆరోగ్యకరమని, మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినవచ్చని వివరించారు. వీటిలో గ్లూకోస్​, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని, అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవని పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ మామిడి పండ్లు బయట నుంచి పర్పుల్ కలర్​లో, లోపల ఎరుపు రంగులో ఉంటాయి.

జబల్​పుర్ మామిడి తోట

Mango Varieties Jabalpur: ఈ తోటలో పండే చైనా ఐవరీ మామిడి పండ్లు ఒక్కో కాయ 2-3 కిలోలు ఉంటుంది. కొన్ని సార్లు నాలుగు కేజీల కాయలు కూడా కాస్తాయి. వీటి పొడవు ఒకటిన్నర అడుగుల వరకు ఉంటుంది. ఈ తోటలోని మామిడి చెట్లకు జనవరిలో పూత పూయడం మొదలవుతుంది. జూన్ చివరినాటికి కాయలు పక్వానికి వస్తాయి. ఈ మామిడి పండ్ల గింజలే 100-250 గ్రాముల బరువు ఉంటాయని సంకల్ప్ చెప్పారు.

జబల్​పుర్ మామిడి తోట
తోటను సందర్శిస్తున్న మహిళలు

ఇదీ చదవండి:డోలో మాత్రపై ఇండియా మ్యాప్.. బాలిక ప్రతిభకు రికార్డులు దాసోహం!

Last Updated : Apr 13, 2022, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details