గల్లీ లీడర్లు, కార్పొరేటర్లు కూడా బయటకు వచ్చేప్పుడు నలుగురు అనుచరులను వెంటేసుకుని కనిపిస్తుంటారు. అలాంటిది దేశ, ప్రభుత్వాధినేతలకు ఇంకెంత భద్రత ఉంటుంది! చుట్టూ అంగరక్షకులు, మెటల్ డిటెక్టర్లు ఉన్నాసరే... దాడులు జరగవని, వారి ప్రాణాలకు ముప్పులేదని చెప్పలేం. అత్యంత సురక్షితమైన జపాన్‌లో మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురికావడమే ఇందుకు నిదర్శనం. గతంలోనూ ఎంతోమంది నేతలు దుండగుల కాల్పులకు బలయ్యారు. వారు ఏ హోదాలో, ఎప్పుడు, ఎలా చనిపోయారంటే...
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1984, అక్టోబరు 31న దిల్లీలోని నివాసం వెలుపల ఉండగా... భద్రతా సిబ్బందిలో సిక్కు మతానికి చెందిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ్టదారుణ ఘటనలో ఇందిర ప్రాణాలు కోల్పోయారు.
రాజీవ్‌గాంధీ
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 1991, మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో రాజీవ్, మరికొందరు మృతిచెందారు.
జాన్ ఎఫ్ కెనెడీ
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హత్య ఇది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కెనెడీ... 1963, నవంబరు 22న భార్యతో కలిసి డాలస్ మీదుగా ఓపెన్ కారులో వెళ్తుండగా, లీ హార్వే ఒస్వాల్డ్ అనే వ్యక్తి ఆయనపై దారుణంగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన కెనెడీ అరగంట తర్వాత కన్నుమూశారు.
జియావుర్ రెహమాన్
బంగ్లాదేశ్ అధ్యక్షునిగా పనిచేసిన రెహమాన్ 1981, మే 30న చిట్టగాంగ్‌లోని ప్రభుత్వ నివాసంలో ఉండగా, సైనిక తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఆయనతో పాటు మరో 8 మంది చనిపోయారు.
అబ్రహం లింకన్
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న అబ్రహం లింకన్ 1865, ఏప్రిల్ 14న వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్‌లో ప్రదర్శనను తిలకిస్తుండగా... జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి తలపై తుపాకీతో కాల్చాడు. గాయపడిన ఆయన మరుసటిరోజు ఉదయమే ప్రాణాలు విడిచారు.
లియాఖత్ అలీ ఖాన్
పాకిస్థాన్ తొలి ప్రధాని అయిన లియాఖత్ అలీ ఖాన్ 1951, అక్టోబరు 16న రావల్పిండిలోని ఈస్ట్ ఇండియా కంపెనీ గార్డెన్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలోనే అఫ్గానిస్థాన్‌కు చెందిన సయీద్ అక్బర్ రెండుసార్లు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అలీ ఖాన్ మరణించారు.