Workers Trapped In Godown Karnataka : కర్ణాటకలోని విజయపురలో ఆహార ధాన్యాల గోదాములో వందలాది బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నాలుగు జేసీబీలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. ముగ్గురు ప్రమాద సమయంలోనే బయటపడగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో పనిచేస్తుండగా మొక్కజొన్న బస్తాలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన ముగ్గురు కార్మికులు వెంటనే సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా ఏడుగురు మాత్రం బయటకు రాలేక అందులోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా బస్తాలు మీద పడడం వల్ల ఊపిరాడక మరణించినట్లు అధికారులు తెలిపారు. కూలీలంతా బిహార్‌కు చెందినవారని తెలిపారు. మృతులను రాజేశ్ ముఖియా (25), రామ్బ్రీజ్ ముఖియా(29), శంభు ముఖియా(26), లుఖో జాదవ్(45), రామ్ బాలక్ (52)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. "కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా పని ప్రారంభించారు. ఒక్కసారిగా మొక్కజొన్న బస్తాలు పడిపోవడం వల్ల చిక్కుకుపోయారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు" అని ఓ అధికారి తెలిపారు.