Modi On Congress : రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకునే గత తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ విధానాలను రూపొందించిందని, కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు ఏసీ గదుల్లో కూర్చుని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయని.. క్షేత్ర స్థాయి వాస్తవికతను చూడలేదని అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లబ్ధిదారులతో మాట్లాడుతోందన్నారు. దీని ద్వారా పథకాల ప్రయోజనం, ఫీడ్‌బ్యాక్ ప్రత్యక్షంగా తీసుకోవచ్చని చెప్పారు. సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారులను నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి ఉదాహరణలుగా అభివర్ణించారు. వారణాసిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Gita Press Centenary Celebrations : అంతకుముందు.. గోరఖ్‌పుర్‌లోని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. గీతా ప్రెస్ కేవలం పుస్తకాలు ముద్రించే ముద్రణాలయం మాత్రమే కాదని, కోట్ల మంది విశ్వాసం, దేవాలయని ఆయన అన్నారు. 'గీతా ప్రెస్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. గీతా ప్రెస్‌తో గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉంది. కల్యాణ పత్రిక ద్వారా గీతా ప్రెస్ కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. గీతా ప్రెస్ భారత దేశాన్ని ఏకం చేయడంతోపాటు, దేశ ఐకమత్యానికి బలాన్ని చేకూరుస్తుంది' అని ప్రధాని మోదీ అన్నారు.
'15 భాషల్లో 1,600 పైగా ప్రచురణలు చేసింది. 1923లో గీతా ప్రెస్ ఆధ్యాత్మిక వెలుగులను ప్రారంభించింది. ప్రస్తుతం అది మానవత్వానికి దిక్సూచిగా మారింది. వందల ఏళ్ల క్రితం వలసవాద శక్తులు భారత దేశాన్ని దోపిడీ చేసి, మన గురుకులాలను ధ్వంసం చేశాయి. అలాంటి సమయంలో గీతా ప్రెస్ మార్గదర్శిగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. అలాంటి సంస్థ శతాబ్ధి ఉత్సవాలన వీక్షించడం మనందరి అదృష్టం' అని మోదీ తెలిపారు.