Womens Reservation Bill 2023 Opposition Reaction :కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బిల్లును 'ఎన్నికల జుమ్లా' అని కాంగ్రెస్ అభివర్ణించింది. మహిళల ఆశలకు 'భారీ ద్రోహం' అని విమర్శించింది. ఈ చట్టం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాతే అమలులోకి వస్తుందని బిల్లులో పేర్కొనడంపై మండిపడింది. 2024 ఎన్నికల లోపు డీలిమిటేషన్ జరుగుతుందా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం 2021 జనగణను ఇంకా నిర్వహించలేదన్నారు. ఇక ఎన్నికల సీజన్లో జుమ్లాల కంటే ఇది పెద్దది అని ఎద్దేవా చేశారు. ఇక జీ20 దేశాల్లో జన గణన చేయడంలో విఫలమైన దేశం భారత్ మాత్రమే అని అన్నారు. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప మరొకటి కాదని ఘాటుగా విమర్శించారు.
ఇది మహిళలను మోసం చేసే బిల్లు: ఆప్
మహిళా రిజర్వేషన్ బిల్లును ఎన్నికల ముందు మహిళలను మోసం చేసే బిల్లు అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత అతిషి విమర్శించారు. బీజేపీకి మహిళల సంక్షేమం పట్ల ఆసక్తి లేదని ఆరోపించారు. ఈ బిల్లును నిశితంగా చిదివితే అది 'మహిళలను ఫూల్ చేసే బిల్లు' అని తెలుస్తుందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్, జనాభా లెక్కల నిబంధనలను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. 'దీని ద్వారా 2024 ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ అమలులోకి రాదని అర్థమవుతుంది. ఇప్పుడున్న డీలిమిటేషన్, జనాభా గణన నిబంధనలు అనుసరించి 2024 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము' అని అతిషి అన్నారు.
ఈ బిల్లుపై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 'మీరు ఎవరికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు? ప్రాతినిధ్యం లేని వారికి రిజర్వేషన్ కల్పించాలి. ముస్లింలకు కోటా లేకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపం. అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము' ఒవైసీ పేర్కొన్నారు.
మద్దతిచ్చిన బీఎస్పీ.. కానీ..
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బహుజన్ సమాజ్వాదీ పార్టీ-బీఎస్పీ అధినేత్రి మయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక కోటా కోసం తమ పార్టీ డిమాండ్ చేస్తున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఏ బిల్లుకైనా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చినా తమకు ఫర్వాలేదని.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చర్చల తర్వాత ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ 33 శాతంలో కోటాలో వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వకపోతే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కులతత్వ మనస్తత్వం ఉందని తమ పార్టీ భావించాల్సి వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ తన ద్వంద్వ వైఖరి దాచలేదు : అమిత్ షా
మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని బీజేపీ వర్గాలు స్వాగతించాయి. పార్లమెంటులో 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ చట్టం)ను ప్రవేశపెట్టడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ బిల్లు తెలియజేస్తోందని తెలిపారు. ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని షా ఎద్దేవా చేశారు. టోకెనిజం తప్ప.. మహిళల రిజర్వేషన్ను కాంగ్రెస్ ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేకపోవడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. ఇది తమ ఘనతగా చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మాత్రం ఎప్పటికీ దాగదని అన్నారు.