ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఊర్లోని మహిళలంతా ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతున్న వారే. మగవారిపై ఆధారపడకుండా.. గ్రామంలోని ఆడవాళ్లంతా ఏకమై, పట్టుపురుగుల పెంపకాన్ని జీవనోపాధిగా మలచుకున్నారు. సాధారణ సాగుకు భిన్నంగా పట్టుపరిశ్రమ నిర్వహణతో ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సూర్యాపేట జిల్లాలోని నంద్యాలగూడెం కర్షక మహిళలు.
పట్టు పురుగుల పెంపకం చాలా సున్నితమైన పని. పురుగులు తినే మల్బరీ ఆకుల కోసం తోటలు పెంచాలి. ఈ తోటల్లో ఎరువులు వేయడం నుంచి పట్టు పురుగులను పరిశ్రమకు పంపే వరకు.. అన్ని పనులూ తామే స్వయంగా చేసుకుంటున్నారు నంద్యాలగూడెం మహిళలు. వీరి నైపుణ్యం గుర్తించి, ప్రభుత్వమూ ప్రోత్సాహమందిస్తోంది. ఇక్రిశాట్ సంస్థ.. వీరి కోసం వాటర్ షెడ్లు నిర్మించింది.
"దీని గురించి ఇక్కడ చెప్పినప్పటికీ, పూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మైసూరుకు వెళ్లాం. 10 రోజులు శిక్షణ పొందాం. పురుగులు ఎలా పెంచాలన్న విషయాలు తెలుసుకున్నాం. తిరిగొచ్చి, పరిశ్రమ ప్రారంభించాం. మిగతా పంటలతో పోలిస్తే మంచి లాభాలే వస్తున్నాయి. మగవాళ్ల సహాయం లేకున్నా, మహిళలే చేసుకోవచ్చు."
- స్వాతి, రైతు
"ఇది బాగుంటుందని తెలిసి, 2010లో పట్టుపరిశ్రమలోకి అడుగుపెట్టాం. ప్రతినెలా పంట చేతికి వస్తుంది. కలుపు తీయడం, చేలు కోయడం, ఎరువులు వేయడం, పురుగుల పెంపకం లాంటి పనులుంటాయి. అన్నీ జాగ్రత్తగా చేస్తేనే పంట దక్కుతుంది."
- పద్మ, పట్టు పురుగుల పెంపకందారు
2014 వరకు ఇక్కడి రైతులకు వరి, పత్తి, పల్లి, కందుల్లాంటి ఆహార పంటల సాగు మాత్రమే తెలుసు. పట్టు పరిశ్రమ గురించి ఓ అవగాహనా కార్యక్రమం ద్వారా తెలుసుకుని, పట్టుపురుగుల పెంపకం చేపట్టాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమల్ని సందర్శించి.. పంటల తీరుతెన్నుల్ని నిశితంగా పరిశీలించారు. ఊరికి తిరిగొచ్చి, మల్బరీ సాగు మొదలుపెట్టారు.