RFCలో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవం women's day celebrations at ramoji film city : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు దేశమంతటా అంబరాన్నంటాయి. ఎన్నడూలేనంత ఘనంగా మహిళకు పట్టం కట్టారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని అతివలను ఉత్సాహపరిచారు. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళా దినోత్సవ వేడుకలు ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి.
women's day celebrations at RFC : రామోజీ గ్రూపు సంస్థల మహిళా సిబ్బంది పాల్గొని సందడి చేశారు. డిజిట్ ఆల్- ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ.. ఎంబ్రేస్ ఈక్విటీ అనే థీమ్‌తో ఈసారి సంబరాలు సాగాయి. ముఖ్యఅతిథిగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. గౌరవఅతిథిగా స్త్రీవాద పత్రిక 'భూమిక' సంపాదకురాలు కొండవీటి సత్యవతి పాల్గొన్నారు. వేడుకల్లో రామోజీ ఫిలిం సిిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి పాల్గొన్నారు.
women's day celebrations 2023 : జ్యోతి ప్రజ్వలనతో మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథులు స్మితా సబర్వాల్, సత్యవతిలను రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ఘనంగా సత్కరించారు. తాను తెలంగాణకు వచ్చిన కొత్తలో తనకు తెలుగు సరిగా రాదని స్మితా సబర్వాల్ అన్నారు. ఈనాడు వల్లే తను తెలుగు త్వరగా నేర్చుకోగలిగానని చెప్పారు. రానున్న కాలంలో ఈనాడు సాహసోపేతమైన జర్నలిజాన్ని కొనసాగిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
"మేం స్థానిక భాషకు చెందిన పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అది యూపీఎస్సీ కంటే కఠినతరంగా ఉంటుంది. అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో రోజంతా గ్రామాలకు వెళ్లేవాళ్లం. తిరిగి వచ్చిన తర్వాత రాత్రి భోజనం చేసి కనీసం అరగంటపాటు ఈనాడు చదివి నోట్స్ రూపొందించుకుని తెలుగు పరీక్షలో విజయం సాధించాను. రానున్న దశాబ్దాల్లోనూ ఈనాడు తన స్వతంత్రమైన, సాహసోపేతమైన జర్నలిజంను కొనసాగిస్తుందని ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే మీరు (ఈనాడు) ప్రజల అభిప్రాయాలు, మాఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఈ బాధ్యత అవసరం." - స్మితా సబర్వాల్, ఐఏఎస్ అధికారి
మహిళామణులు సాధించిన విజయాలు కళ్లకు కట్టేలా ఏవీ ప్రదర్శించారు. సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. కేక్ కట్టింగ్‌తో వేడుకను మరింత మధురంగా మార్చారు. క్షణం తీరికలేకుండా గడిపే తమలో ఈ సంబరాలు జోష్ నింపాయని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శక్తిని చాటేలా రూపొందించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బోస్కో గ్రూప్ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.