తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వికటించిన నాటు వైద్యం.. మహిళ మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

కీళ్ల నొప్పులు వస్తున్నాయని నాటు వైద్యం చేయించుకునేందుకు వెళ్లిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. నాటువైద్యులు ఇచ్చిన మూలికలు తిని మహిళ మరణించింది. ఝార్ఖండ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, తనపై అరిచాడని తండ్రిని హత్య చేశాడు ఓ వ్యక్తి. గుజరాత్​లో ఈ ఘటన జరిగింది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు.

Crime News
Crime News

By

Published : Jan 30, 2023, 11:00 PM IST

ఝార్ఖండ్​లోని బొకారో జిల్లాలో ఘోరం జరిగింది. కీళ్లనొప్పుల చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ నాటు వైద్యానికి బలైంది. తొలుత మహిళకు ఇద్దరు వైద్యులు మూలికలు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె భర్తకు ఇవ్వజూపారు. అతడు కాస్త వెనకడుగు వేయడం వల్ల.. అతడిలో భరోసా నింపేందుకు తొలుత వైద్యులు ఆ ఔషధాన్ని తిని చూపించారు. ఈ ఔషధం స్వీకరించిన మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్తతోపాటు ఇద్దరు వైద్యులు అస్వస్థతకు గురయ్యారు.

బొకారో జిల్లాలోని జగోదీ గ్రామానికి చెందిన ఓ మహిళ కీళ్లనొప్పుల చికిత్స కోసం లఘను బేడియా, రాధేశ్యామ్ సోరెన్ అనే వైద్యులను సంప్రదించింది. దీంతో వైద్యులు ఆమెకు మూలికలను ఇచ్చారు. అవి తిన్న మహిళ అక్కడే మృతిచెందింది. మహిళ భర్త, ఇద్దరు నాటు వైద్యుల పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యంతో ఉన్న మహిళ ఆమె భర్తకు భరోసా ఇవ్వడానికి, వైద్యులు ఇద్దరు సైతం మందు తాగినట్లు చెబుతున్నారు. దీని తరువాత, వైద్యుల ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించింది. అందరూ వాంతులు చేసుకున్నారు. వెంటనే వీరిని స్థానిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

తండ్రిని హత్య చేసిన వ్యక్తి..
లైట్ స్విట్ ఆఫ్ చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడని.. ఓ యువకుడు కన్న తండ్రిని హత్య చేశాడు. తలపై రాయితో కొట్టి చంపేశాడు. ఈ ఘటన గుజరాత్​లోని సూరత్​లో జరిగింది. అమ్రోలీ ప్రాంతంలో నివసిస్తున్న గణేశ్ సవాయ్ అనే వ్యక్తి.. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. ఒడిశాకు చెందిన అతడు.. తన ఇద్దరు కుమారులతో కలిసి ఇక్కడ జీవిస్తున్నాడు. ఓ కుమారుడు స్థానికంగా పనిచేస్తున్నాడు. మరో కుమారుడు శంకర్ మానసిక పరిస్థితి సరిగా లేదు. శంకర్.. రాత్రివేళ లైట్ స్విచ్​లను ఆపేశాడు. దీనిపై అతడి తండ్రి గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గొడవ మొదలైంది. తండ్రి తనపై అరుస్తున్నాడన్న కోపంలో.. శంకర్ దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న ఓ రాయితో తండ్రి తలపై కొట్టాడు. దెబ్బ బలంగా తాకడం వల్ల గణేశ్ సవాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ప్రేయసిని ఆన్​లైన్​లో వేధించి..
బ్రేకప్ అయిన తర్వాత గర్ల్​ఫ్రెండ్​ను ఆన్​లైన్​లో లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఎస్​డీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అకౌంటెంట్ అని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు జుబేర్ గతంలో బాధితురాలితో ప్రేమలో ఉన్నాడు. ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ.. వివాహం చేసుకోవాలని భావించారు. అయితే, యువకుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని భావించిన యువతిని అతడిని మూడేళ్ల క్రితం దూరం పెట్టింది. అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు.. ఆమెను ఆన్​లైన్​లో వేధించడం మొదలుపెట్టాడు. ఫేక్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని.. ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. యువతి అభ్యంతరకరమైన ఫొటోలను వాట్సాప్​లో స్టేటస్​లు పెట్టేవాడు. ఇవన్నీ చూసి మనస్తాపానికి గురైన యువతి.. ఆత్మహత్యాయత్నం చేసింది. చివరకు బతికి బయటపడ్డ ఆమె.. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించింది. జనవరి 25న తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. యువతి ఇచ్చిన వివరాలతో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తనను వదిలేసిందన్న కోపంతోనే యువతిని వేధింపులకు గురిచేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

ABOUT THE AUTHOR

...view details