Women Reservation Bill President Sign :పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీంతో మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం దాల్చింది. లోక్‌సభ, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు కేంద్రం 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. జనాభా లెక్కల తర్వాత చేపట్టే డీలిమిటేషన్ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేసే తేదీ నుంచి ఇది అమలవుతుంది.
'నారీ శక్తి వందన్ అధినియమ్'
Nari Shakti Vandana Adhiniyam 2023 :రిజర్వేషన్ల బిల్లును 'నారీ శక్తి వందన్ అధినియమ్'గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉభయ సభల్లో అభివర్ణించారు. అధికారికంగా 106వ రాజ్యాంగ సవరణ బిల్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఇప్పుడు రాజ్యాంగ (106వ సవరణ) చట్టంగా మారింది. లోక్సభలో ఈ బిల్లుకు ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మినహా అందరూ మద్దతు పలికారు. బిల్లుపై సెప్టెంబర్ 20న లోక్సభలో 8 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. ఓటింగ్లో మొత్తం 454 మంది పాల్గొన్నారు. 452 మంది మద్దతు పలకగా... రెండు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. బిల్లుపై విపక్షాలు పలు సవరణలు ప్రవేశపెట్టగా.. అవన్నీ వీగిపోయాయి.