Women Reservation Bill In Parliament : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. ఈ బిల్లును సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది ఓటు వేసి ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడం వల్ల దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది.
'డీలిమిటేషన్ పూర్తి చేయకపోతే వారు రాజీనామా చేయాలి'
అంతకుముందు, వీలైనంత త్వరగా నియోజకవర్గాల పునర్వవ్యవస్థీకరణను పూర్తి చేసి.. మహిళా రిజర్వేషన్ల బిల్లును అమల్లోకి తేవాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సూచించారు. రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన.. 1972లో డీలిమిటేషన్ ప్రక్రియ నాలుగేళ్లపాటు సాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2029లోపు నియోజకవర్గాల డీలిమిటేషన్ పూర్తి చేయకపోతే... ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేసేలా ప్రకటన చేయాలని అన్నారు.
"ఈ బిల్లు 2014లో ఎందుకు ఆమోదం పొందలేదో.. 2023లో ఇప్పుడు ఎందుకు ఆమోదం పొందుతుందో మనందరికీ తెలుసు. ఈ దేశంలో ఇప్పటివరకు మూడుసార్లు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. 1972లో ప్రారంభమైన డీలిమిటేషన్ ప్రక్రియ 1976 వరకు సాగింది. దేశంలో 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దేశంలో 2001, 2011 సంవత్సరాల్లో జనగణన ఎలాంటి అంతరాయం లేకుండా జరిగింది. 2021 జనగణన మాత్రం ఇప్పటివరకు జరగలేదు. కొవిడ్ కారణంగా ఆ సమయంలో జనగణన చేపట్టలేదన్న కారణం చెప్పారు. అమెరికా, ఇంగ్లాండ్, చైనా వంటి దేశాలు ఈ కరోనా సమయంలోనే తమ జనగణనను పూర్తి చేశాయి. 2029లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకపోతే ఈ బిల్లు అమలు చేయలేం. 2029లోపు డీలిమిటేషన్‌ను పూర్తి చేస్తామని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ సభలో ప్రకటన చేయాలి. లేకపోతే తర్వాత అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రధాని, హోంమంత్రి రాజీనామా చేయాలి."
-- కపిల్ సిబల్, రాజ్యసభ ఎంపీ