Women Reservation In Lok Sabha :చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. 8 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లురాగా వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణలు కూడా వీగిపోయాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటం వల్ల ఈ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యసభ ఆమోదం కూడా లభిస్తే నియోజక వర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.
Womens Reservation Bill India : 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొన్నేళ్లు పట్టడం ఖాయం. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029లోనే పార్లమెంటు ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశముంది. 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే అవకాశముంది.
గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. 2010లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించినా లోక్‌సభ పచ్చజెండా ఊపలేదు. దాదాపు 27ఏళ్లుగా ఇది పెండింగ్‌లోనే ఉంది. ఈసారి మహిళా రిజర్వేషన్లకు దాదాపు పార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది