Women Reservation Bill 2023 Today in Lok Sabha : విపక్షాల ఆందోళనల మధ్య మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంటు కొత్త భవనంలో సమావేశాల తొలి రోజునే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును దిగువసభ ముందుకు తీసుకొచ్చారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరక 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందీ బిల్లును. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని పార్లమెంట్ ముందుకు తీసుకురావడం ద్వారా మహిళలు రెండున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమైంది.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు అని.. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో విధాన రూపకల్పలనలో మహిళల భాగస్వామ్యం పెరిగేందుకు వీలు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుందని పేర్కొంది. చట్ట సభల్లో జరిగే చర్చల్లో మహిళలు విభిన్న దృక్కోణలాను తీసుకువస్తారని.. సరైన నిర్ణయం తీసుకోవడంలో నాణ్యతన మెరుగుపరుస్తారని చెప్పింది. బిల్లుకు 'నారీ శక్తి వందన్ అధినియం' అని పేరు పెట్టింది. అయితే తాజా బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
ఈ రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు చాలా ముఖ్యమైన బిల్లు అని అర్జున్ రామ్మేఘ్వాల్ చెప్పారు. దీని ద్వారా 239ఏఏ అధికరణాన్ని పొందుపరుస్తున్నామని తెలిపారు. దీంతో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఆర్టికల్ 330ఏ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌సీట్లలో ఆ వర్గాల మహిళలకు 33 శాతం సీట్లు.. ఆర్టికల్ 332ఏ ద్వారా శాసనసభలో మహిళలకు 33 శాతం స్థానాలు రిజర్వ్ అవుతాయని తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో మహిళా ఎంపీల సంఖ్య 82 నంచి 181కి పెరుగుతుందని వెల్లడించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు.
ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన మోదీ.. ఈ బిల్లుకు కేబినెట్ భేటీలో ఆమోదం లభించిందని.. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం కావాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి ప్రక్రియను ప్రపంచం గుర్తించిందని.. క్రీడల నుంచి స్టార్టప్‌ల వరకు మహిళలు అందించిన సహకారాన్ని చూస్తోందని తెలిపారు. ఈ బిల్లుపై చాలా ఏళ్లుగా వాదనలు జరిగాయని.. 1966లో మొదటి సారి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆ తర్వాత వాజ్‌పేయీ హయాంలోనూ ఈ బిల్లు ప్రస్తావన వచ్చినా.. అప్పుడు ఆ కల నెరవేరలేదని తెలిపారు.