రాజ్యసభ సమావేశాలు జరిగిన చివరి రోజున మహిళా ఎంపీలపై మార్షల్స్ చెయ్యి చేసుకున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. విపక్షాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభ సీసీటీవీ కెమెరా ఫుటేజీని విడుదల చేసింది.
సభాపతి స్థానం వద్దకు విపక్ష ఎంపీలు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఎంపీలను మార్షల్స్ చుట్టుముట్టినట్లు, ఇద్దరు మహిళా ఎంపీలు ఓ మహిళా మార్షల్‌ను తోసేసినట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. పెద్దల సభలో విపక్షాలు ప్రవర్తించిన తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే అవమానకరమని పేర్కొన్నారు. దేశ ప్రజలు తమ పక్షాన లేరన్న వాస్తవాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.
'అరాచకత్వమే అజెండా'
మరోవైపు, రాజ్యసభలో నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సజావుగా సాగనివ్వొద్దని కాంగ్రెస్ సహా పలు సన్నిహిత పార్టీలు ముందుగానే నిర్ణయించుకున్నాయని అన్నారు. కుదిరితే నా దారి, లేదంటే రహదారి అన్న విపక్షాల వైఖరి సరికాదని హితవు పలికారు.
"పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జరిగిన దానికి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వీధుల నుంచి పార్లమెంట్ వరకు అరాచకత్వం సాగించడమే విపక్షాల ఏకైక అజెండా. రాజ్యసభ కార్యదర్శి టేబుల్.. డ్యాన్సులు చేయడానికో, నిరసన చేయడానికో కాదు. ఆందోళన చేసిన ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్ చర్యలు తీసుకోవాలి."
-ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి