ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె తన యజమానినే పొట్టన పెట్టుకుంది. తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. మహిళ ప్రాణాలు తీసింది. ఆమె గొంతును నోటితో కరచుకొని.. రెండు దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒంటె దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.
ఇదీ జరిగింది..
పప్పు బఘేల్.. సస్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్గోయ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతని భార్య తోతా దేవి. వీరు ఇంటి వద్ద ఒక ఒంటెను పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ఇతర సామానులు మోసేందుకు దీన్ని వినియోగిస్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం ఒంటెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లింది దేవి. అదే సమయంలో ఆమెపై ఆ జంతువు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది.
దేవి అరుపులు విన్న చుట్టుపక్క నివాసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఒంటెను కర్రలతో కొట్టి దాని నోట్లో నుంచి దేవిని విడిపించారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది. ప్రేమగా పెంచుకున్న ఒంటె.. దేవి ప్రాణం తీయడంపై గ్రామస్థులందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా ఆదివారం దేవి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.
ఓ ఇంట్లోని ఫ్రీజర్‌లో మహిళ మృతదేహం..
మధ్యప్రదేశ్‌లోని ఓ ఇంట్లో.. ఫ్రీజర్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. రీవా జిల్లాలోని సిటీ పోలీస్ పరిధిలో ఉన్న జియులీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని ఆమె భర్తే కొట్టి చంపాడని.. మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. భర్త మాత్రం ఆమె అనారోగ్యంతో చనిపోయిందని చెబుతున్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జియులీ గ్రామానికి వెళ్లి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక తరవాతే బాధితురాలు మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు. "నా సోదరికి 2000 సంవత్సరంలో భరత్ మిశ్రతో వివాహం జరిగింది. అతడు రోజూ తాగొచ్చి ఆమెను కొట్టేవాడు. ఇంటి నుంచి చాలా సార్లు గెంటేశాడు. భరత్‌కు చాలా సార్లు కౌన్సిలింగ్ కూడా ఇప్పించాం. అయినా గానీ లాభం లేకుండాపోయింది" అని మృతురాలి సొదరుడు అభయరాజ్ వెల్లడించాడు.
భర్తే తన సోదరిని హత్యచేశాడని అభయ్‌రాజ్ ఆరోపిస్తున్నాడు. ఘటన గురించి తన మేనకోడలు ఫోన్ చేసి చెప్పిందని అతడు వివరించాడు. మృతురాలి శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. భరత్ మాత్రం తన భార్య కామెర్ల వ్యాధితో చనిపోయిందని చెబుతున్నాడు. తన కొడుకు కోసం ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లు వెల్లడించాడు. అతడు వేరే ప్రాంతంలో ఉన్నాడని వచ్చేసరికి సమయం పడుతుందని తెలిపాడు. కాగా జూన్ 30న భరత్ విపరీతంగా మద్యం సేవించాడని పక్కింటి వారు చెబుతున్నారు. అదే రోజు అర్థరాత్రి ఇంట్లో నుంచి బాధితురాలి అరుపులు వినిపించాయని వారు వివరించారు.