Women killed boyfriend: లవర్ పిలిచిందని ఆనందంగా ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతను ప్రేమించిన మహిళే ఈ దారుణానికి ఒడిగట్టింది. కొందరు దుండగులతో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డ ఆమె.. ఆ హత్యను లైవ్ వీడియో తీసింది. ఆమె ఇదంతా తన బాయ్‌ఫ్రెండ్ చెప్పాడు కాబట్టే చేసింది. ప్రియుడిని చంపేయడమేంటి? అలా చేయమని బాయ్‌ఫ్రెండే చెప్పడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమె అసలు లవర్ మృతిచెందిన వ్యక్తి కాదు.. అతని సోదరుడు! సినీమా స్టోరీలా అనిపిస్తున్న ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో గతనెల 24న జరిగింది.
ఇదీ జరిగింది..: శుక్రవాడీ గ్రామానికి చెందిన దయానంద లదంతి (24) దుబాయ్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సొంతూరుకు వచ్చిన దయానంద్ మళ్లీ దుబాయ్‌కు తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఓ రోజు అతనికి కలబురగిలోని బసవేశ్వర కాలనీకి చెందిన అంబిక అనే మహిళ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చిన మిస్డ్‌కాల్ ఎవరిదో చూద్దామని కాల్ చేసిన దయానంద్ అంబిక ట్రాప్‌లో పడ్డాడు. అంబిక మాయ మాటలకు.. అతను మూడు రోజుల్లోనే ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ఓ రోజు దయానంద్‌కు అంబిక ఫోన్ చేసి.. కలుసుకుందామని.. తన ఇంటికి రమ్మని పిలిచింది. అంబిక స్కెచ్ గురించి తెలియని దయానంద్ ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి పథకం ప్రకారం అంబిక దయానంద్‌ను స్కూటీపై ఎక్కించుకుని నగర శివార్లలోని వాజ్‌పేయీ కాలనీకి తీసుకెళ్లింది. అదే ప్రాంతానికి షాబజార్కు చెందిన కృష్ణ, నీలకంఠ్, సురేశ్, సంతోష్ అనే మరో నలుగురు నిందితులు చేరుకున్నారు. అంతా కలిసి దయానంద్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అంతటినీ ఆమె వీడియో తీసింది.