Priyank kharge news 'కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలి' అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో అవినీతి జరుగుతోందని ఆరోపించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తనయుడైన ప్రియాంక్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా ఎదురుదాడికి దిగింది.
కలబురగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రియాంక ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని ప్రకటించుకున్న బొమ్మై- పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఖర్గే అన్నారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగాలనూ తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని తాను 'లంచం- మంచం' ప్రభుత్వమని అనేందుకు సంకోచించనని వ్యాఖ్యానించారు. ఎస్సై నియామకాలకు నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలతో మూడు లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మగాళ్లు అయితే లంచం ఇవ్వాల్సి వస్తోందని, యువతుల అయితే మరో రకమైన ఒత్తిడి వస్తోందంటూ పేర్కొన్నారు. యువతతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. అక్రమాలను బయటపెట్టిన తనను సీఐడీ అధికారులతో నోటీసులు పంపించి బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.