ప్రస్తుతం రోజుల్లో వంట చేసుకునేందుకు అందరూ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ అప్పట్లో మొత్తం కట్టెలపైనే ఆధారం. అందుకోసం స్థానికంగా అటవీ ప్రాంతముంటే అక్కడికి వెళ్లి కట్టెలు తెచ్చుకునేవారు. ఆ విధంగానే.. 46 ఏళ్ల క్రితం రాజస్థాన్‌కు చెందిన 12 మంది మహిళలు.. ఆడుతూ పాడుతూ అడవికి వెళ్లి చెట్లు నరికి కట్టెలు తెచ్చుకున్నారు. అది చూసిన అటవీ శాఖ అధికారులు.. ఆ మహిళలపై కేసు నమోదు చేశారు. ఇన్నేళ్లకు వారిలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. భిల్వారా, బుందీ జిల్లాలకు చెందిన 12 మంది మహిళలు.. 1977లో కట్టెల కోసం స్థానికంగా ఉన్న అడవికి వెళ్లారు. అక్కడ ఉన్న కొన్ని చెట్లను నరికి ఇంటికి తెచ్చుకున్నారు. మహిళలు చెట్లను నరకడం చూసిన ఓ అటవీ శాఖ ఉద్యోగి.. అటవీ హక్కుల చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుందీ పోలీసులు.. ఆ మహిళలపై కేసు నమోదు చేశారు. తమపై కేసు నమోదైన విషయం ఆ విషయం మహిళలకు తెలియదు.
బుందీ పోలీసులు.. 46 ఏళ్ల క్రితం నమోదైన కేసును పూర్తిగా మరిచిపోయారు. పేరుకుపోయిన పాత కేసులను పరిష్కరించడంలో భాగంగా తాజాగా పోలీసులు.. మళ్లీ ఆ కేసును బయటకు తీశారు. చెట్లను నరికిన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భిల్వారా, బుందీ జిల్లాల్లో ఉంటున్న ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళలు మరణించినట్లుగా గుర్తించారు. మరో ఇద్దరు మహిళల జాడ.. పోలీసులకు లభించలేదు.
అదుపులోకి తీసుకున్న వారిని జుమ్మా దేవీ(70), మోతియన్ బాయి(75), టీకాద్(72), లాలీ బాయి(75), బాచి బాయి(70), పుష్ప(75)గా గుర్తించి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. మహిళల వయసును పరిగణలోకి తీసుకుని కేసును కొట్టివేసింది. జరిమానా మాత్రమే విధించింది. తమకు అప్పట్లో చట్టాలపై అవగాహన లేదని మహిళలు.. కోర్టుకు తెలిపారు. వంట చేయడానికి కట్టెలు తప్పనిసరి కనుక నిత్యం అడవికి వెళ్లి సేకరించేవారమని చెప్పారు. అయితే చనిపోయిన ముగ్గురి మహిళల మరణ ధ్రువీకరణ పత్రాలను వారి బంధువులు కోర్టుకు అందజేశారు.