గిరిజన మహిళపై నీరు పోసి.. వార్నింగ్ Women discrimination: తమిళనాడు దిండిగల్ జిల్లాలో ఆదివాసీ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించాడు ఓ స్థానికుడు. పళనిలో చిరు వ్యాపారం చేసుకుంటుకున్న నారికురవ మహిళపై (ఆదివాసీ మహిళ) నీరుపోసి.. బెదిరించాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
విల్లుపురం జిల్లాకు చెందిన విజయశాంతి అనే నారికురవ మహిళ పళనిలో బొమ్మల వ్యాపారం చేసుకుంటోంది. అయితే డిసెంబరు 18 (శనివారం) ఉదయం పళని హిల్ టెంపుల్ ఎదురుగా శుభం హోటల్ రోడ్డు పక్కన ఆమె కూర్చుంది. బాధితురాలు కూర్చున్న సమీపంలోని ఇంటి డాబాపై ఉన్న ఓ వ్యక్తి.. ఆమెపై నీళ్లు పోసి ఇక్కడ వ్యాపారం చేయొద్దని బెదిరించాడు. అక్కడే ఉంటే మళ్లీ మళ్లీ నీళ్లు పోస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
"ఇంటి బాల్కనీ నుంచి నీళ్లు పోసిన వ్యక్తి.. అక్కడ ఎవరూ కూర్చొని వ్యాపారం చేయవద్దని చెప్పాడు. ఒకవేళ కూర్చుంటే నీళ్లు పోస్తానని బెదిరించాడు. ఇలా చేయడం చాలా బాధగా ఉంది" అని విజయశాంతి వాపోయింది.
పళని మురుగన్(సుబ్రహ్మణ్యస్వామి) ఆలయానికి తమిళ మాసం కార్తీకై నుంచి పంగుని వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శబరిమల యాత్రికులు కూడా అక్కడ వెళ్లి బొమ్మలతో సహా పలు వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారాలు చేసి పొట్ట నింపుకునేందుకు రాష్ట్ర నలుమూలల అక్కడికి చిరు వ్యాపారులు వెళ్తుంటారు. అలాగే వెళ్లిన వాళ్లలో విజయశాంతి ఒకరు.
ఇదీ చూడండి:మహిళా కానిస్టేబుళ్లపైకి కత్తిపీటతో దూసుకొచ్చి..