వారేమీ పెద్దయెత్తున ప్రచారం చేయడం లేదు. భారీ ఉపన్యాసాలు ఇవ్వడమూ లేదు.. కానీ పోటీలో ఉన్న ఆ ముగ్గురు మహిళలు కేరళలో ప్రతి చోటా చర్చనీయాంశంగా మారారు. కేవలం గెలుపు కోసమే కాకుండా ఒక ఆశయ సాధన కోసం రంగంలో ఉండడమే ఇందుకు కారణం.
రాజకీయ హత్యలకు నిరసన
రాజకీయ హత్యలకు నిరసన తెలుపుతూ రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ (ఆర్‌ఎంపీ) అభ్యర్థిగా కె.కె.రెమా (51)..కొళికోడ్ జిల్లా వడకర నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త టి.పి.చంద్రశేఖరన్ ఒకప్పుడు సీపీఎంలో ఉండేవారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అనుచరుడు కూడా. కొన్ని అంశాలపై విభేదించి అసమ్మతివాదిగా ముద్రపడ్డారు. సొంతంగా ఆర్‌ఎంపీని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై 51 కత్తిపోట్లు కనిపించాయి. ముగ్గురు సీపీఎం కార్యకర్తలు సహా 11 మందికి జీవితఖైదు శిక్షలు పడ్డాయి. రాజకీయాల పేరుతో హత్యలు జరగకూడదని కోరుకుంటూ 2016 ఎన్నికల్లో పోటీ చేసిన రెమా 20 వేల ఓట్లు సంపాదించారు. ప్రస్తుతం పోటీ చేయడానికి ఇష్టపడకపోయినా, పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకు మళ్లీ రంగంలో ఉన్నారు.
అతివలు ఎందులో తక్కువ?
పురుషాధిక్యతను వ్యతిరేకించడంతోపాటు, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడానికే లతికా సుభాష్ (56) పోటీ చేస్తున్నారు. కేరళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె టికెట్ కోరుకోగా నిరాశే మిగిలింది. ఇందుకు నిరసన తెలుపుతూ బహిరంగంగానే గుండు గీయించుకున్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులకు టికెట్లు ఇచ్చి, ఒక్క మహిళా కాంగ్రెస్‌నే ఎందుకు విస్మరించారన్నది ఆమె ప్రశ్న. లతికా సుభాష్ ప్రస్తుతం కొట్టాయం జిల్లా ఎట్టుమానూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కుమార్తెల మరణానికి న్యాయం ఎప్పుడు?
పాలక్కాడ్ జిల్లా వలయార్ పట్టణంలో 2017లో దారుణం జరిగింది. తమకు ఉన్న చిన్న గుడిసెలో 13, 9 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు దళిత వర్గానికి చెందిన అక్కా చెలెళ్లు ఉరివేసుకొని మరణించారు. అత్యాచారం జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి. సాధారణ గృహిణి అయిన ఆ బాలికల తల్లి అందరి చుట్టూ తిరిగింది. ఇంతవరకు ఎక్కడా న్యాయం జరగలేదు. దాంతో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పోటీచేస్తున్న ధర్మదాంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో గౌను గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చూడండి:సాగు చట్టాల ప్రతులతో హోలీ కా దహన్