సంకల్పం గట్టిగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా అనుకున్నది సాధించవచ్చు. ఇదే విషయాన్ని నిరూపించారు బిహార్‌కు చెందిన ఓ మహిళ. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ విషయం.. చుటు పక్క ప్రాంతాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
బంకా జిల్లాకు చెందిన రుక్మిణీ కుమారి(22).. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నిండు గర్భిణీ అయిన ఆమె.. ఎలాగైనా పది పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది. అయితే ఫిబ్రవరి 14న ఆమె మొదటి పరీక్ష రాసింది. అదే రోజు సాయంత్రం ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే రుక్మిణీని స్థానిక ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
ఆ తర్వాత రోజు ఉదయం ఆరు గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో కూడా ఆమకు పరీక్ష విషయం గుర్తుకు వచ్చింది. మరో మూడు గంటల్లో జరగనున్న సైన్స్ పరీక్షను ఎలాగైనా రాయాలని ఫిక్స్ అయింది. కానీ కుటుంబసభ్యులు, వైద్యులు మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఆమె మాత్రం ఎగ్జామ్ రాయడానికి మొగ్గుచూపింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసింది. ఎగ్జామ్ హాల్‌కు అందులో ఆమెను తీసుకెళ్లింది. రుక్మణికి తోడుగా వైద్య సిబ్బందిని కూడా పంపింది. మొత్తానికి ఆమె విజయవంతంగా పరీక్ష పూర్తి చేసింది.