భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భర్త చేయి నరికేసిన దారుణ ఘటన బంగాల్లో జరిగింది. రక్తపుమడుగులో వచ్చిన ఆమెకు ప్రస్తుతం దుర్గాపుర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కుడి చేయి లేదని నిరాశ చెందని బాధితురాలు ప్రస్తుతం ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్ చేస్తుంది. ఆరునూరైనా తన లక్ష్యాన్ని విడిచిపెట్టనని చెబుతోంది. బాధితురాలు ఆసుపత్రిలో ఎడమ చేతితో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహిళా కమిషన్ చీఫ్ లీనా గంగోపాధ్యాయ ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆమె నర్సుగా తన వృత్తిని కొనసాగించలేకపోతే వేరే ఉద్యోగం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కమిషన్ చీఫ్ హామీ ఇచ్చారు.
ఇదీ జరిగింది.. బంగాల్లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కోజల్సా గ్రామంలో షేర్ మహమ్మద్, రేణు ఖాతున్ భార్యాభర్తలు నివసిస్తున్నారు. రేణు.. దుర్గాపుర్‌లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో నర్సింగ్ శిక్షణ తీసుకుండేది. ఈ మధ్యే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసై ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడానికి నిందితుడు షేర్ మహమ్మద్ అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వివాదాలు తలెత్తాయి. ఆ సమయంలోనే భార్యపై కోపంతో పదునైన ఆయుధంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని ఆసుపత్రిగా తరలించగా వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలి అత్త, మామలను అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడు పరారీలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు.