ప్రమాదంలో ఓ సైనికుడిని కాపాడిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్యోతి(30).. ఇప్పుడు కేరళ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 7న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తోంది.
2010, జనవరి 3.. జ్యోతి జీవితంలో ఓ కీలకమలుపు. ఆరోజు జరిగిన ఓ ఘటన వల్ల తన చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన చేతికి అయిన గాయమే దానికి కారణం. తన తల్లిదండ్రుల కోపాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఓ కొత్త ప్రేమనూ సంపాదించుకుంది.
ట్రక్కు ఢీ కొట్టబోతుండగా...
బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్ చదువుతున్న ఆమె రోజులాగే... ఆరోజు కూడా కళాశాల నుంచి ఇంటికి బస్సులో వెళుతోంది. తన ముందు సీట్లో కేరళకు చెందిన వికాస్ అనే ఓ జవాను కూర్చున్నాడు. దంతెవాడ జిల్లాలో క్యాంపునకు తిరిగి వస్తున్నాడు అతడు. ఆ సమయంలో బస్సు కిటికీకి తల ఆనించి నిద్రపోయాడు. ఈలోగా బస్సును ఓ భారీ ట్రక్కు డీకొట్టబోతుండంటం గ్రహించింది జ్యోతి. వెంటనే అప్రమత్తమై వికాస్‌ను పక్కకు లాగి.. ప్రాణాపాయం నుంచి తప్పించింది. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రంగా గాయమైంది. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమెపై తల్లిదండ్రులు కోప్పడ్డారు.
ఈ క్రమంలోనే వికాస్, జ్యోతి మధ్య పరిచయం పెరిగింది. అది ప్రేమగా మారింది.