ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ గిరిజన మహిళను.. కొంతమంది గ్రామస్థులు వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. జిల్లాలోని బోరాటాండ్ గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ అనే వ్యక్తి.. జుమునియా గ్రామంలో ఉంటున్న బాధితురాలి కుమార్తెను ప్రేమిస్తున్నాడు. అయితే బాధితురాలి కుమార్తె.. శుక్రవారం ఓంప్రకాశ్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఓంప్రకాశ్ భార్య ఆ యువతితో గొడవపడింది. తన భర్త దగ్గరకు ఎందుకు వచ్చావని గట్టిగా నిలదీసింది. అంతే కాకుండా గ్రామస్థులందిరినీ పిలిచి పంచాయతీ పెట్టింది. యువతికి రూ.15 వేలు జరిమానా విధించారు గ్రామస్థులు.
ఆ విషయం తెలుసుకున్న బాధితురాలు.. కుమార్తెను రక్షించుకోవడానకి ఆ గ్రామానికి వెళ్లింది. ఒక్కసారిగా గ్రామంలోని అంతా కలిసి ఆమెను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలిని వాంగ్మూలం తీసుకన్నారు. 100 మంది బోరాటాండ్ గ్రామస్థులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఓం ప్రకాశ్ భార్య కూడా బాధితురాలితో పాటు ఆమె కుమార్తెపై కేసు పెట్టింది.
కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి..
మహారాష్ట్రలోని ముంబయిలో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ ఓ 20 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మలాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని లవ్గార్డెన్లో ఈ ఘటన జరిగింది.
కబడ్డీ ఆడుతూ చనిపోయిన కార్తీక్ పోలీసుల వివరాలు ఇలా..పశ్చిమ మలాద్ ప్రాంతంలోని లవ్గార్డెన్లో గురువారం కబడ్డీ మ్యాచ్‌లు నిర్వహించారు. సంతోశ్ నగర్లో నివాసం ఉంటున్న కార్తీక్.. గోరేగావ్‌లోని వివేక్ కాలేజ్‌లో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మిట్టల్ కాలేజ్ టీమ్ తరఫున అతడు ఆడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం కబడ్డీ మ్యాచ్ మొదలైంది. ఆటలో భాగంగా కార్తీక్‌ను ఆటగాళ్లంతా పట్టుకున్నారు. ఆ సమయంలో అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని.. స్నేహితులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చిరుత దాడి.. ఏడాదిన్నర చిన్నారి మృతి..
రాజస్థాన్‌లో జైపుర్ జిల్లాలో దారుణం జరిగింది. చిరుతపులి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఏడాదిన్నర చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామస్థుల కథనం ప్రకారం.. జిల్లాలోని బస్నా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఇంటి బయట కార్తీక్ అనే ఏడాదిన్నర బాలుడు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో చిరుత వచ్చి అతడిని తీసుకుని వెళ్లిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు.. పరిగెత్తి వెళ్లి బాలుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రామస్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటవీశాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.