Woman slapped police in Delhi: మాస్కు పెట్టుకోమని చెప్పిన పోలీసు చెంప చెళ్లుమనిపించింది ఓ మహిళ. దిల్లీలోని శహదారా జిల్లాలోని సీమాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
shot police for asking to wear mask
కారులో వచ్చిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి దిల్షద్ గార్డెన్ సమీపంలో ఆగారు. వీరిలో ఎవరూ మాస్కు ధరించలేదు. అదే సమయంలో గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. వీరిని మాస్కు పెట్టుకోవాలని సూచించారు. అంతమాత్రం దానికే కట్టలు తెంచుకున్న కోపంతో పోలీసుపై దాడి చేసింది ఓ మహిళ. కారులో ఉన్న మరో వ్యక్తి.. ఏకంగా తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు.
సీమాపురి స్టేషన్‌కు సమాచారం పంపించగానే అదనపు పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన ఓ పిస్తోల్, 20 కాట్రిడ్జ్‌లు, 5 షెల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాముకు ముందు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వీరంతా తూర్పు దిల్లీ ఆనంద్ విహార్ సమీపంలోని పట్పర్గంజ్ ప్రాంతానికి చెందినవారని విచారణలో తేలింది. కాల్పులు జరిపిన వ్యక్తి వృత్తిరీత్యా న్యాయవాది అని పోలీసులు తెలిపారు. నంద్ నాగ్రి ప్రాంతంలోని జువెనైల్ జస్టిస్ బోర్డులో వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్నాడని చెప్పారు. ఘటన సమయంలో నిందితుడి భార్య, ఆమె చెల్లెలు కారులో ఉన్నారని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:బుజ్జి ఏనుగును కాపాడబోతే గజరాజుల దాడి- ఊరంతా ధ్వంసం!