తెలంగాణ

telangana

ETV Bharat / bharat

19 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన 'ఊర్మిళ'.. భర్తతో మళ్లీ పెళ్లి! - భర్తను మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ కటక్​

Woman Reunited With Family : ఇల్లు విడిచివెళ్లిన ఓ మహిళ 19 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకుంది. అనంతరం తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఒడిశాలోని కటక్​ జిల్లాలో జరిగింది.

Woman Reunited With Family
Woman Reunited With Family

By

Published : Jul 4, 2023, 5:33 PM IST

19 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన 'ఊర్మిళ'.. భర్తతో మళ్లీ పెళ్లి!

Woman Reunited With Family : ఓ మహిళ 19 ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంది. అనంతరం తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత మహిళ ఇంటికి చేరుకోవడం వల్ల.. ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని కటక్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది.. భబ్‌చంద్‌పుర్ గ్రామానికి చెందిన బసంత్​ పరిదా, ఊర్మిళ పరిదా భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె దునాకిని ఉన్నారు. మతిస్తిమితం కోల్పోయిన ఊర్మిళ.. 2004లో తన మేనళ్లుడి ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరింది. ఆ తర్వాత తప్పిపోయి.. ఇంటికి వెళ్లే మార్గం మరిచిపోయింది. ఊర్మిళ ఎంతకీ ఇల్లు చేరుకోకపోవడం వల్ల.. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. కానీ ఊర్మిళ ఆచూకీ లభించలేదు.

ఇటీవల తిగిరా పట్టణంలోని ఓ ఏటీఎమ్​ వద్ద నిస్సహాయ స్థితిలో ఉన్న ఊర్మిళను ఓ వ్యక్తి చూశాడు. అనంతరం వీడియో తీసి ట్విట్టర్​ పోస్ట్​ చేశాడు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ మహిళను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్​కు ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం కలెక్టర్​ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా శ్రీ మందిర్​ సేవాశ్రమం సభ్యులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఆశ్రమం సభ్యులు.. ఊర్మిళను రక్షించారు. ఆశ్రమానికి తీసుకొచ్చి నెలన్నర పాటు చికిత్స అందించారు. చికిత్స ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఊర్మిళ కోలుకుని.. జ్ఞాపక శక్తిని తిరిగిపొందింది. తన పేరు, తల్లి పేరు లాంటి వివరాలను గుర్తుచేసుకుంది. దీంతో ఆ మహిళ చెప్పిన వివరాలను వీడియో తీసి.. సోషల్​ మీడియాలో షేర్​ చేశారు ఆశ్రమం సభ్యులు.

ఆ వీడియోలో ఊర్మిళను గుర్తించిన ఆమె కుమార్తె.. వివరాలు తెలుసుకోవాల్సిందిగా తండ్రి, తమ్ముడికి చెప్పింది. దీంతో వారు.. వీడియోలో ఉన్న మహిళ ఊర్మిళనే అని నిర్ధరించుకోడానికి ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం ఆమెను గుర్తుపట్టి సోమవారం ఇంటికి తీసుకెళ్లారు. సుదీర్ఘ కాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఊర్మిళ.. తన భర్త బసంత్​ను మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ మేరకు​ ఆమె నుదుట బొట్టు పెట్టి.. పూలమాల వేసి స్వాగతించాడు బసంత్​. ఊర్మిళ ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఆమె కుమార్తెకు పెళ్లైందని.. కుమారుడి వయసు ఆరేళ్లు అని శ్రీ మందిర్​ సేవాశ్రమం వ్యవస్థాపకుడు శివశంకర్​ తెలిపారు. దీన్ని ఓ అరుదైన ఘటనగా అభివర్ణించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details