WOMAN RAPED TWICE: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితులను కుల్దీప్ బిష్ణోయ్(23), బాబురామ్ జాట్(22)గా గుర్తించారు పోలీసులు. కుల్దీప్.. విద్యార్థి కాగా, బాబురామ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
బాధిత మహిళకు 18ఏళ్లు ఉంటాయని.. 14ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహమైందని పోలీసులు వెల్లడించారు. తన వదినను చంపినందుకు ఆమెను అదుపులోకి తీసుకొని మందోర్లోని పునరావాస కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు. తన బిడ్డను చూసేందుకు అక్కడి నుంచి శుక్రవారం రాత్రి తప్పించుకున్న ఆ మహిళ.. అత్యాచారానికి గురైందని వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ పునరావాస కేంద్రం నుంచి పారిపోగానే.. రహదారిపై బిష్ణోయ్ కనిపించాడు. బస్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. కానీ, అక్కడికి తీసుకెళ్లకుండా.. తన రూమ్‌కు వెళ్లాడు. అక్కడ మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం, ఆమెను సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. బిష్ణోయ్ మందోర్ స్టేషన్లో పనిచేసే ఓ పోలీసు కుటుంబానికి చెందినవాడని స్టేషన్ హౌజ్ అధికారి మనీశ్ దేవ్ వెల్లడించారు.