హరియాణాలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు హత్యాచారం చేశారు. అనంతరం మృతదేహాన్ని పార్క్‌లో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫరీదాబాద్‌లో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం..ఫరీదాబాద్ సెక్టార్ 7లోని పార్క్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. హత్యాచారం చేసి సగం దుస్తులతో ఉన్న మహిళ మృతదేహాన్ని కొందరు పార్క్‌లో పడేశారు. ఆమె జననాంగాల్లో పైప్ చొప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన మహిళ వయసు 32 ఏళ్లు ఉంటుందని చెప్పారు. అమె తలకు స్వల్ప గాయాలున్నట్లు తెలిపారు. తల నుంచి కారిన రక్తం.. పూర్తిగా ఎండిపోయి ఉందని చెప్పారు. 2-3 రోజుల క్రితం మహిళ మృతిచెంది ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మృతురాలు ఎవరో ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు.
పార్క్‌లో శవం ఉందని గురువారం ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాద్షా ఖాన్ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. హత్యాచారం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శవ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. మృతురాలిని గుర్తించిన తర్వాత నిందితులును త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
అప్పులు తీసిన ప్రాణాలు..
అప్పులు ప్రాణాల మీదకు తెచ్చాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటుంబంలోని ఐదుగురు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం.. నవాడ జిల్లాలోని నగర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన పండ్ల వ్యాపారి కేదార్‌లాల్ గుప్తా 12 లక్షలు అప్పు చేశాడు. వడ్డీలు అధికమై.. వేధింపులు తట్టుకోలేక బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగాడు. అనంతరం ఆ ఐదుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఓ గుడి వద్ద పడి ఉన్న వాళ్లను ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని.. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను కేదార్ లాల్ గుప్తా, అతడి భార్య అనితాదేవితో పాటు గుడియా కుమార్, ప్రిన్స్ కుమార్, శబ్నం కుమారిగా పోలీసులు గుర్తించారు. కేదార్ మరో కుమార్తె సాక్షి కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్షి కుమారి ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.