Woman mixing drugs in husbands food: నీరు, ఆహారంలో డ్రగ్స్ కలిపి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బాధితుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా విచారణ చేపట్టి పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో జరిగిందీ ఘటన.
ఏం జరిగిందంటే?
కొట్టాయంకు చెందిన సతీశ్(38), ఆశా సురేశ్(36)లకు 2006లో వివాహమైంది. 2008 నుంచి సతీశ్.. మురికుంపుళలోని తన భార్య ఇంట్లోనే ఉంటున్నారు.
పెళ్లైనప్పటి నుంచి తన భార్యతో తరచుగా వాగ్వాదాలు జరిగేవని సతీశ్ ఆరోపిస్తున్నారు. తర్వాత, కొన్నేళ్ల నుంచి తనకు ఎప్పుడూ నీరసంగా ఉండేదని చెప్పారు. ఒంట్లో చక్కెర స్థాయి తక్కువ అయ్యాయని వైద్యులు చెప్పారని వివరించారు. అయితే, ఇంటి భోజనం మానేసిన తర్వాత తన ఆరోగ్యం మెరుగైందని అన్నారు.
"2021 సెప్టెంబర్లో 20 రోజుల పాటు నేను ఇంట్లో భోజనం చేయలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని నా భార్య స్నేహితురాలికి చెప్పాను. నాకు ఏదైనా మందులు ఇస్తోందేమోనని కనుక్కోమన్నాను. ఆమె దీనిపై దృష్టిపెట్టి విషయాన్ని గుర్తించింది. 2015 నుంచి నాకు ఇస్తున్న ఆహారంలో యాంటీ-డిప్రెజంట్ డ్రగ్స్ కలుపుతోందని తెలిసింది. ప్రతి రోజు మూడుసార్లు ఆహారం, నీళ్లలో కలిపి ఇస్తోంది."
-సతీశ్, భార్య బాధితుడు
దీంతో సతీశ్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీటీవీ ఫుటేజీలను ఆధారాలుగా సమర్పించాడు. దీనిపై పాలా డిప్యూటీ ఎస్పీ షాజూ జోస్ విచారణ చేపట్టి.. నిందితురాలిని అరెస్టు చేశారు. వారి ఇంట్లో ఔషధాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. మహిళను కోర్టులో ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆమె రిమాండ్లో ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:గీజర్ గ్యాస్ లీకై మహిళా పైలట్ మృతి.. బాత్రూంలోనే..