Woman Lodged Complaint Against Peacock : తనపై నెమలి దాడి చేసిందని ఓ మహిళ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు గ్రామస్థులు సైతం మద్దుతుగా నిలిచారు. ఈ ఘటన కర్ణాటక.. రామనగర జిల్లాలో జరిగింది. నెమలి.. తన పదునైన ముక్కుతో గాయపరిచిందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
చన్నపట్టణ తాలుకాలోని అరళాలుసంద్ర గ్రామంలో లింగమ్మ అనే మహిళ నివసిస్తోంది. ఆమె ఇంటి ప్రాంగణంలో ఓ నెమలి కొద్ది రోజులుగా సంచరిస్తోంది. అయితే జూన్ 26న లింగమ్మ తన ఇంటి సమీపంలో పని చేస్తుండగా.. నెమలి ఆమెపై దాడి చేసింది. దీంతో లింగమ్మ.. జూన్ 28న నెమలి తనను గాయపరిచిందని అటవీ శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను గాయపరిచిన నెమలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమెకు మద్దతుగా లిఖితపూర్వక ఫిర్యాదుపై మరికొందరు గ్రామస్థులు కూడా సంతకాలు చేశారు. ఆమె ఫిర్యాదును అటవీశాఖ సిబ్బంది స్వీకరించారు.
"నాపై దాడి చేసిన నెమలిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. నాపై నెమలి దాడి జరిగిన రోజు నా కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరుసటి రోజు బీవీ హళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాను. అటవీ శాఖ అధికారులు.. నెమలిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలి."
--లింగమ్మ, నెమలిపై ఫిర్యాదు చేసిన మహిళ
మరోవైపు, నెమలి.. గ్రామస్థులపై దాడి చేస్తోందని అటవీ అధికారుల ఎదుట వాపోయారు అరళాలుసంద్ర వాసులు. అలాగే తమ పొలంలో వేసిన విత్తనాలను సైతం నెమలి తినేస్తోందని అధికారులకు చెప్పారు.
గుర్రంపై కేసు..
ప్రధాన రహదారులపై గుర్రం సంచరిస్తోందని.. దీని వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్ణాటక.. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబలో ఆదివారం జరిగింది. ఫిర్యాదుదారుడు గుర్రాన్ని కొబ్బరి చెట్టుకు కట్టేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఇదీ జరిగింది..
కడబలోని.. ఆలెక్కడికి చెందిన ఓ వ్యక్తికి చెందిన గుర్రం గత కొన్ని రోజులుగా రోడ్డులపై సంచరిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుర్రం వల్ల చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. రోడ్డుపై అడ్డంగా వచ్చిన గుర్రాన్ని ఓ వాహనదారుడు పక్కన ఉన్న పొలంవైపు తోలాడు. ఈ గుర్రం.. సామాజిక కార్యకర్త రాఘవ కలారాకు చెందిన పొలంలోకి వెళ్లి అతడి పశువుల కోసం వేసిన గడ్డిని తినేసింది. అప్పుడు రాఘవ.. గుర్రాన్ని పట్టుకుని తన పొలంలోని కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. వెంటనే కడబ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గుర్రం యజమానిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. గుర్రాన్ని రోడ్డుపైకి రానివ్వొద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని పోలీసులకు ఎల్ఓయూ(లెటర్ ఆఫ్ అండర్టేకింగ్) రాసి ఇచ్చాడు గుర్రం యజమాని.
గుర్రాన్ని తీసుకెళ్తున్న యజమాని