తమిళనాడులో దారుణం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వేడి టీ ఇవ్వనందుకు దూషించిందని అత్తను చంపేసింది ఓ కోడలు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుకోట్టై జిల్లా విరాలిమలై సమీపంలోని మలైకుడిపట్టికి చెందిన వేలు.. భార్య పళనయమ్మాళ్, కుమారుడు సుబ్రమణితో కలిసి నివసిస్తున్నాడు. సుబ్రహ్మణికి ఇటీవలే గణకు అనే స్త్రీతో వివాహం జరిగింది. సుబ్రమణి సైకిల్ రిపేర్ షాపు నడుపుతున్నాడు. అయితే గణకుకు మానసిక సమస్యలు ఉన్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఆమె మందులు వేసుకోలేదని తెలిసింది.
అయితే పళనియమ్మాల్ మంగళవారం.. టీ కొనేసి తీసుకురమ్మని కోడలు గణకుకు చెప్పింది. చెప్పినట్టుగానే గణకు టీ తీసుకుని వచ్చి పళనియమ్మాల్‌కు ఇచ్చింది. అయితే టీ వేడిగా లేదని కోడలిని అత్త తిట్టింది. కోపం పెంచుకున్న కోడలు.. అత్త పళనియమ్మాల్ తలపై ఇనుప రాడ్‌తో కొట్టింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం బంధువులు ఆమెను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి చేర్పించారు. అయితే చికిత్స పొందతూ పళనియమ్మాల్ మృతి చెందింది. సమచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. పళనియమ్మాల్ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణకుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
యోగా చేస్తున్న వ్యక్తి మృతి..
ఇటీవలే కాలంలో అనేక మంది మధ్య వయస్కులు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి.. యోగా చేస్తూ ఛాతీ నొప్పి వచ్చి ఒక్కసారి కుప్పకూలిపోయాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని హీరాబాగ్ సర్కిల్ సమీపంలోని సంతలాల్ సొసైటీలో నివసిస్తున్న 44 ఏళ్ల ముకేశ్ భాయ్ యోగా క్లాస్‌కు వెళ్లాడు. యోగా చేస్తుండగా.. ముకేశ్‌కు ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత నీరు తాగి వాంతులు చేసుకున్నాడు. వెంటనే యోగా క్లాస్‌లో ఉన్న వారు అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
ఇద్దరికీ జీవిత ఖైదు..
మహారాష్ట్రలో 28 ఏళ్ల యువకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు ఠాణె జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులకు ఒక్కొక్కొరికి రూ.10000 జరిమానా కూడా విధించింది. ఈ ఘటన 2019 ఫిబ్రవరి 7న భివాండిలో జరిగిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ లద్వాంజరి తెలిపారు. పవర్‌లూమ్ కార్మికుడు అబ్బాస్ ఫౌజీ, అతడి సోదరుడు తమ ఇంటికి వచ్చిన అతిథుల కోసం సమీపంలోని హోటల్ నుంచి ఆహారం తీసుకరావడానికి వెళ్లారు. అదే సమయంలో నిందితులు అన్సారీ, సల్లూ ఖాన్.. అబ్బాస్ సోదరుల వెంటపడి రూ.200 ఇవ్వమని డిమాండ్ చేశారు. అందుకు అబ్బాస్ సోదరులు నిరాకరించారు. దీంతో అన్సారీ, సల్లూ కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబ్బాస్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు.