ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్‌కేస్‌లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రీతి శర్మ తన భర్త దీపక్‌ను విడిచిపెట్టి, నాలుగేళ్లుగా ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఫిరోజ్‌ను ఆమె పెళ్లిచేసుకోవాలని భావించగా.. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో.. పక్కా పథకం ప్రకారం రేజర్‌తో యువకుడి గొంతు కోసి చంపింది. అనంతరం.. మృతదేహాన్ని పడేసేందుకు దిల్లీలోని సీలంపుర్ ప్రాంతంలో పెద్ద సూట్‌కేసు కొనుగోలు చేసి తీసుకెళ్లింది. అనుమానించిన పోలీసులు.. మహిళను అనుసరించారు. సూట్‌కేసులో మృతదేహాన్ని చూసి విచారించగా అసలు విషయం తెలిసింది. ఫిరోజ్.. దిల్లీలో హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోరిక తీర్చలేదని.. లైంగిక వాంఛ తీర్చనందుకు యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టి.. ట్రక్కు నుంచి కిందకు పడేశాడు ఓ డ్రైవర్. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. మథురాలోని దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. శనివారం ఈ ఘటన జరిగింది.
ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే యువతి కోసికాలన్ వద్ద రోడ్డు పక్కన నిల్చొని ఉంది. అప్పుడే అటుగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ లిఫ్ట్ ఇస్తానని ఆమెను వాహనం ఎక్కేలా చేశాడు. కొద్దిసేపటికి ఆమెపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు. ప్రతిఘటించిన యువతి సాయం చేయమంటూ గట్టిగా అరిచింది. గమనించిన వాహనదారులు.. ట్రక్కును అనుసరించిన తరుణంలో నిందితుడు ఆమె తలపై రాడ్డుతో కొట్టి బయటకు విసిరేశాడు. బాధితురాల్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.