కర్ణాటక బెళగావిలో విషాదకర ఘటన జరిగింది. భర్త మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓ మహిళ తన ఏడాదిన్నర చిన్నారిని చంపి.. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతులను వంతమూరి గ్రామానికి చెందిన హోలెప్ప మారుతి(25), అతని భార్య వాసంతి (22), వారి ఏడాదిన్నర చిన్నారిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన ప్రకారం..
మారుతి మద్యం తాగి వచ్చి గురువారం రాత్రి తన భార్య వాసంతితో గొడవపడ్డాడు. కొపోద్రిక్తుడైన మారుతి ఆవేశంలో విషం తాగేశాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. భర్త మరణంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య వాసంతి.. తన ఏడాదిన్నర చిన్నారిని తీసుకుని ఊరికి దూరంగా ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడే తన చిన్నారి గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత తాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలిక ఆడుకోవడానికి బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో మిగిలింది.
రైలు నుంచి కిందకి తోసేసిన జవాన్లు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. నడుస్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడిని కిందకి తోసేశారు ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు. ఈ ఘటనలో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఝార్ఖండ్‌కు చెందిన అరుణ్ భుయాన్‌గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.