బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా టీచర్‌పై అత్యాచారయత్నం చేశారు ఐదుగురు దుండగులు. తనను రక్షించమని బస్సు డ్రైవర్, కండక్టర్‌ను ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో తనను తాను రక్షించుకునే సమయంలో ఆ మహిళ కదులుతున్న బస్సులో నుంచి దూకి నిందితుల చెర నుంచి బయటపడింది. కాగా వేగంగా కదులుతున్న బస్సులో నుంచి దూకడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాలు..
బంగాల్లోని డార్జిలింగ్‌కు చెందిన 35 ఏళ్ల మహిళా టీచర్ మంగళవారం రద్దీగా ఉన్న ఓ బస్సులో ప్రయాణిస్తోంది. బస్ స్టాప్‌లు వస్తున్న కొద్దీ అందులో ఉన్న ప్యాసింజర్లు ఒక్కొక్కరుగా దిగిపోయారు. చివరకు ఐదుగురు వ్యక్తులు, మహిళా టీచర్ మిగిలారు. బస్సులో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన దుండగులు మొదట అసభ్యకర సైగలు చేయడం ప్రారంభించారు. అనంతరం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు.
ఈ సమయంలో తనను కాపాడమని బస్సు డ్రైవర్, కండక్టర్‌ను మహిళ ప్రాధేయపడింది. అయినప్పటికీ.. వారు స్పందించకుండా బస్సును అలాగే ముందుకు పోనిచ్చారు. ఇదే అదనుగా భావించిన నిందితులు మరింత రెచ్చిపోయి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు ఆ మహిళ.. కదులుతున్న బస్సులో నుంచి దూకేసింది. కామాంధుల చెర నుంచి బయట పడ్డప్పటికీ.. ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మహిళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే బస్సును గుర్తించామని, నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.