ఝార్ఖండ్‌లోని లతేహార్లో హృదయవిదారక ఘటన జరిగింది. గిరిజన కుటుంబానికి చెందిన ఓ దివ్యాంగురాలు పెన్షన్ తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతోంది. బ్యాంక్‌కు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల దివ్యాంగురాలి కుమారుడు, భర్త కలిసి కావడిని ఏర్పాటు చేసి అందులో తీసుకెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
లతేహార్ జిల్లాలోని మహుదంద్ గ్రామానికి రోడ్లు సరిగ్గా లేవు. ఈ గ్రామస్థులు పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాలంటే కాలి నడకే శరణ్యం. అయితే ఇదే గ్రామానికి చెందిన లాలో కోర్బా అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. లాలో .. దివ్యాంగురాలు కావడం వల్ల ఆమె నడవలేదు. దీంతో పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు ఆమె భర్త దేవా, కుమారుడు సుందర్‌లాల్ కావడి కట్టి అందులో చిన్న బుట్ట ఏర్పాటు చేసి లాలోను కూర్చొబెట్టారు. అలా కొన్ని కిలో మీటర్లు ప్రయాణించి బ్యాంక్‌కు చేరుకున్నారు. అయినా విధి మరోలా తలచింది. బ్యాంక్ సర్వర్ పనిచేయక పోవడం వల్ల లాలోకు పింఛన్ అందలేదు. దీంతో మండుటెండలో కావడిలో వృద్ధురాలిని ఇంటికి తీసుకొచ్చారు ఆమె భర్త, కుమారుడు.
పెన్షన్ కోసం కావడిలో దివ్యాంగురాలి తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు "మా గ్రామానికి రోడ్డు లేదు. ప్రజలు కాలినడకనే వేరే ప్రదేశాలకు వెళ్తుంటారు. నా భార్య దివ్యాంగురాలు. ఆమె నడవలేదు.ఆమె పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే కావడిలో భుజాన మోసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఎండా వానా లెక్కచేయకుండా నడవాల్సిన పరిస్థితి. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది."
--దేవా, దివ్యాంగురాలి భర్త
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. దివ్యాంగులకు వారి ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని పేర్కొన్నారు.
పెన్షన్ కోసం కావడిలో దివ్యాంగురాలి తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు పింఛను కోసం వృద్ధురాలి పాట్లు.. విరిగిన కుర్చీ సాయంతో..
కొన్నాళ్ల క్రితం ఒడిశాకు చెందిన ఓ వృద్ధురాలు పింఛను కోసం నానా అవస్థలు పడింది. నబరంగపుర్కు చెందిన వృద్ధురాలు పడుతున్న కష్టం అందరినీ చలింపజేసింది. సూర్య హరిజన్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం మండే ఎండలో విరిగిన కుర్చీ సాయంతో అనేక కిలోమీటర్లు ప్రయాణించింది. ఆమె కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు. విరిగిన కుర్చీని ఆసరాగా చేసుకుని ఆ వృద్ధురాలు చాలా దూరం ప్రయాణించి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆమె చేతి వేలిముద్రలు సరిగా పడట్లేదు. అందుకే బ్యాంక్ అధికారులు ఆమెకు పెన్షన్ ఇవ్వలేదు.
అస్థిపంజరంలా ఉన్న వృద్ధురాలు మండుటెండలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. బానుగూడ పంచాయతీకి చెందిన సూర్య హరిజన్ పెద్ద కొడుకు సీతారం పొట్టకూటి కోసం వేరే రాష్ట్రానికి వలస వెళ్లాడు. చిన్న కుమారుడు మాషురామ్ గ్రామంలో ఆవుల మేపుతున్నాడు. అతడు సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.