సాధారణంగా ఓ మనిషి గుండె మూడు నిమిషాలు కొట్టుకోకపోతే ఇక ఆ వ్యక్తి మన మధ్య లేనట్లే అని నిర్ధరిస్తారు వైద్యులు. అలాంటిది ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాలపాటు ఆగిపోయింది. అయినా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మేరఠ్‌లోని లాలా లజపత్ రాయ్ మెమోరియల్ వైద్య కళాశాలలో జరిగింది. ఓ మహిళ గుండెకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె గుండె దాదాపు 210 నిమిషాలు కొట్టుకోలేదు. అయినా ఆ ఆపరేషన్ విజయవంతం చేసి ఆమె ప్రాణాలను రక్షించారు వైద్యులు.
వివరాల్లోకి వెళ్తే...
ఉత్తరప్రదేశ్‌లోని కంకరఖేడాకు చెందిన కవిత అనే మహిళ గత రెండేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. పనులు చేస్తుంటే అలసటగా ఉందని, తరచూ ఛాతి నొప్పి వస్తోందని ఆస్పత్రికి వెళ్లింది. ఎన్నో ఆస్పత్రులకు తిరిగినా వెయిటింగ్ లిస్ట్ కారణంగా ఆమెకు చికిత్స అందలేదు. ఈ మేరకు మేరఠ్‌లోని లాలా లజపత్ రాయ్ మెమోరియల్ వైద్య కళాశాలను సంప్రదించింది.