Woman Gives Birth To Triplets :బిహార్‌లోని జముయీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. అయితే ఆ మహిళకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారుడి కోసం గర్భం దాల్చగా ముగ్గురు ఆడపిల్లలను జన్మనిచ్చిందని చెప్పారు.
జిల్లాలోని ఖైర్ బ్లాక్ మంగోబందర్ గ్రామానికి దిల్‌చంద్ మాంఝీతో బిందు దేవి అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనాన్ని సాగిస్తున్నారు. గుడిసెలో నివాసముంటున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలన్న కోరికతో ఆమె కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. కానీ ఈసారి ఏకంగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
"10 సంవత్సరాల క్రితం బిందుదేవికి దిల్‌చంద్ మాంఝీతో పెళ్లి జరిగింది. కుటుంబపోషణ కోసం వీరు కూలీ పనులు చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరి వయసు మూడేళ్ల లోపే. ఈసారి బిందు ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నా కుమార్తె కుటుంబ పోషణ ఎలా సాగుతుందో అర్థం కావడం లేదు" అని మహిళ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, తమకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేదని మహిళ చెప్పింది. ప్రభుత్వం నుంచి రేషన్ అందడం లేదని తెలిపింది.
'కు.ని ఆపరేషన్ తర్వాత ఇద్దరికి జన్మ- మళ్లీ గర్భం'
మరోవైపు, బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన ఓ మహిళ తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక కూడా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చానని చెబుతోంది. తనకు గైఘాట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని తెలిపింది. ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చిన ఆమె.. కు.ని ఆపరేషన్ విఫలమైనందుకు సంబంధిత వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆశ్రయించినట్లు చెప్పింది.