తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. అంతా బాలికలే.. గర్భిణీకి సాధారణ డెలివరీ - ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ

ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది ఓ మహిళ. వారంతా బాలికలే కావడం విశేషం. శిశువులు ఏడు నెలలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, ఓ మరుగుజ్జు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు వైద్యులు.

Woman Gave Birth To Five Children At Once
Woman Gave Birth To Five Children At Once

By

Published : May 23, 2023, 8:42 AM IST

ఝార్ఖండ్​లోని రాంచీలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. గర్భం దాల్చిన ఏడు నెలలకే బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ప్రసవం సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. శిశువులంతా బాలికలేనని వైద్యులు తెలిపారు. వారంతా తక్కువ బరువుతో జన్మించారని వెల్లడించారు. చిన్నారులను నియోనేటల్ ఐసీయూలో ఉంచినట్లు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన మహిళ ఛత్రా జిల్లాలోని ఇత్కోరీ ప్రాంతంలో నివసిస్తోంది. పలు సమస్యల వల్ల ఆమెకు గర్భం దాల్చడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందుకోసం ఆమె నిరంతరం చికిత్స తీసుకుంది. చివరకు గర్భం దాల్చింది. సోమవారం పురిటి నొప్పులు వచ్చేసరికి రిమ్స్​లో చేరింది మహిళ. రిమ్స్ వైద్యుడు శశి బాల సింగ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం.. గర్భిణీకి సాధారణ ప్రసవం చేసింది. ప్రస్తుతం తల్లి పరిస్థితి బాగానే ఉందని రిమ్స్ వైద్యులు తెలిపారు. చిన్నారులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఒకే కాన్పులో ఐదుగురు జన్మించడం ఝార్ఖండ్​లో ఇదే తొలిసారి అని రిమ్స్ యాజమాన్యం వెల్లడించింది.

మరుగుజ్జుకు ప్రసవం..
మరోవైపు, ఛత్తీస్​గఢ్​లోని సుర్గుజా జిల్లాలో ఓ మరుగుజ్జుకు సురక్షితంగా ప్రసవం చేశారు వైద్యులు. పురుటి నొప్పులతో అంబికాపుర్ మెడికల్ కాలేజీలో చేరిన 3.7 అడుగుల ఎత్తు ఉన్న ఓ మహిళకు విజయవంతంగా డెలివరీ చేశారు. గర్భిణీ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని, క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ విజయవంతంగా డెలివరీని పూర్తి చేశామని మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ ఆర్ మూర్తి వెల్లడించారు.

మరుగుజ్జు గీతా యాదవ్(29) సూరజ్​పుర్ జిల్లా భాట్​గావ్​లోని రాజ్​కిశోర్ నగర్​లో నివసిస్తోంది. ఆమె భర్త సైతం సాధారణం కంటే తక్కువ ఎత్తు ఉంటాడు. గీతా యాదవ్ ఇటీవల గర్భం దాల్చింది. నొప్పులు వచ్చేసరికి అంబికాపుర్​ ఆస్పత్రిలో చేరింది. మహిళ ఎత్తు తక్కువగా ఉండటం, నార్మల్ డెలివరీకి ఆమె శరీరం సహకరించేలా లేకపోవడం వల్ల.. సిజేరియన్ చేయాలని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. నిపుణులైన వైద్య బృందం ఆమెకు విజయవంతంగా ప్రసవం చేసింది. శిశువు బరువు 2కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువుతో పాటు తల్లి ఆరోగ్యం సైతం మెరుగ్గానే ఉందని వెల్లడించారు.

"మహిళ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ఆమెకు ప్రసవం చేయడానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఇలాంటి వారికి అనస్థీషియా ఇవ్వడం చాలా రిస్క్. మత్తు ఇస్తే బిడ్డ అవయవాలు వైఫల్యం చెందే ప్రమాదం ఉండేది. అందుకే ఈ కేసు చాలా క్లిష్టమైనది. కానీ, మా వైద్య బృందం విజయవంతంగా ఆమెకు ఆపరేషన్ పూర్తి చేసింది. శిశువు, తల్లి ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు."
- డాక్టర్ ఆర్ మూర్తి, మెడికల్ కళాశాల డీన్

ABOUT THE AUTHOR

...view details