Woman Drives Bus: చిన్న పిల్లలు, మహిళలతో వెళ్తున్న ఓ మినీ బస్సును నడిపి అందరి మన్ననలు పొందుతున్నారు 42 ఏళ్ల మహిళ. అదీ క్లిష్ట పరిస్థితుల్లో. మహారాష్ట్ర పుణెలో జరిగిందీ ఘటన.
వారంతా.. పుణె సమీపంలోని షిరూర్‌లో ఉన్న వ్యవసాయ పర్యటక కేంద్రానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. బస్సును నడుపుతున్న డ్రైవర్ అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. ఖాళీగా ఉన్న రోడ్డుపై బస్సును ఆపి ఫిట్స్ వచ్చినట్లు సంకేతాలు అందించాడు. అందులో ఉన్న పిల్లలు ఏడవడం ప్రారంభించారు. మహిళలు కూడా భయాందోళనకు గురయ్యారు.
అప్పుడే తెగువ చూపిన 42 ఏళ్ల యోగితా సతవ్ అనే మహిళ బస్సును తన నియంత్రణలోకి తీసుకున్నారు. ధైర్యంగా ఆ వాహనాన్ని నడిపి.. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికుల్ని కూడా వారి ఇళ్లకు చేర్చారు.
''నాకు కారు నడపడం తెలుసు. అందుకే ఆ సమయంలో బస్సును నియంత్రించాలని అనుకున్నాను. అస్వస్థతతో ఉన్న ఆ డ్రైవర్‌కు సరైన వైద్యం అందేలా చూడటమే నా ప్రధాన బాధ్యతగా భావించా. అందుకే.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించా.''