కర్ణాటకలో దారుణం జరిగింది. న్యాయవాది, సామజిక కార్యకర్త అయిన ఓ మహిళను కారుతో ఢీ కొట్టారు కొందరు దుండగులు. అనంతరం ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ఘటన కలబురగి జిల్లాలో బుధవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన మజత్ సుల్తాన్.. భర్త సద్దాంతో కలసి కలబురగిలో నివసిస్తోంది. సద్దాంకు నసీం, నదీం అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. తన సోదరులతో సద్దాంకు ఓ ఆస్తి విషయంలో వివాదం నడుస్తోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గొడవలతో విసిగిపోయిన సద్దాం దంపతులు.. వేరే ప్రాంతానికి మకాం మార్చారు.
కారుతో ఢీకొట్టి.. రాళ్లతో దాడి చేసి.. స్కూటీపై వెళ్తున్న మహిళ దారుణ హత్య - woman murder in karnataka
స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను కారుతో ఢీకొట్టారు కొందరు దుండగులు. అనంతరం ఆమెపై రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిగ్ నిపుణుల బృందాలతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
బుధవారం ఇల్లు ఖాళీ చేసి, వస్తువులను కొత్త ఇంటికి తరలిస్తున్న సమయంలో స్కూటీపై వెళ్తున్న మజత్ను.. కారులో వెంబడిస్తున్న నలుగులు నిందితులు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టారు. దీంతో మజత్ స్కూటీతో సహా కిందపడిపోయింది. అనంతరం ఆమెను రాళ్లుతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో సహా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య గురించి తెలుసుకున్న సీపీ చేతన్ ఆర్, డీసీపీ అద్దూరు శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
"మహిళ హత్య గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఓ న్యాయవాది అని తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. హత్య ఎలా చేశారు? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయి. చనిపోయిన మహిళ భర్తను విచారించాము. అతడు కొన్ని ఆరోపణలు చేశాడు. అతడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తాము. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ బృందం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఆ మహిళ స్కూటీపై వెళ్తున్నప్పుడు దుండగులు ఆమెపై దాడి చేసి చంపేసినట్లు ప్రాథమికంగా తెలిసింది." అని డీసీపీ వెల్లడించారు.
కాగా, తన భార్యను చంపింది తన సోదరులేనని.. వారికి అజీం గౌడి, వసీం గౌడి అనే ఇద్దరు వ్యక్తులు సహాయం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి భర్త సద్దాం ఆరోపించాడు. అంతకుముందు ఆస్తి విషయంలో తన సోదరులు ఇచ్చిన ఫిర్యాదు కాణంగా తాము రెండు సార్లు జైలు వెళ్లొచ్చామని తెలిపాడు.