కుమారుడి ఫీజు డబ్బుల కోసం బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ప్రభుత్వ పరిహారం వస్తే ఫీజు కట్టొచ్చని.. వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు కింద పడి మరణించింది. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడు సేలంలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జూన్ 28న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. సేలం జిల్లాకు చెందిన పాపాపతి అనే మహిళ.. స్థానిక కలెక్టర్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త మరణించగా. ప్రస్తుతం కుమారుడు, కూతురుతో కలిసి ఉంటోంది. అయితే, కుమారుడు అడిగిన కళాశాల ఫీజు రూ.45,000 చెల్లించేందుకు పాపాపతి వద్ద డబ్బులు లేవు. దీంతో తెలిసిన వారందరినీ అడిగినా ప్రయోజనం లేదు. అప్పు కోసం వెతికినా ఎక్కడా దొరకలేదు. దీంతో పాపాపతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఉద్యోగిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే.. ప్రభుత్వం పరిహారం ఇస్తుందని సన్నిహితులు ఆమెకు సలహా ఇచ్చారు. కారుణ్య నియామకాల ద్వారా కుమారుడికి ఉద్యోగం సైతం ప్రభుత్వ ఇస్తోందని ఆమెకు చెప్పారు.
వారి మాటలను నమ్మిన పాపాపతి.. అగ్రహారం వద్ద వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అయితే, పాపాపతి.. ప్రభుత్వ ఉద్యోగి కాదని.. ఒప్పంద కార్మికురాలని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. ఆత్మహత్య కేసుగా మార్చారు. మహిళ ఉద్దేశపూర్వకంగానే బస్సు కింద పడినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోందని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.