ఒడిశా మల్కాన్‌గిరిలో దారుణం జరిగింది. భర్త ఈఎంఐలో మొబైల్ తీసుకున్నాడని ఆగ్రహించిన ఓ మహిళ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ జరిగింది..
కలిమేలా బ్లాక్‌కు చెందిన జ్యోతి, కనైకు ఏడాది క్రితం వివాహమైంది. అనంతరం కనై.. జ్యోతికి ఈఎంఐలో మొబైల్ కొన్నాడు. ఈఎంఐలో ఫోన్ కొన్న విషయం తన భార్య జ్యోతికి చెప్పలేదు. అన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి ఒక డాక్యుమెంట్‌పై సంతకం కోసం కనై ఇంటికి వచ్చాడు. అప్పుడు తన భర్త ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేసినట్లు జ్యోతికి తెలిసింది. భర్త ఇంటికి రాగానే జ్యోతి అతడితో వాగ్వాదానికి దిగింది. అనంతరం మనస్తాపానికి గురై విషం తాగేసింది. ఈ ఘటనతో కలత చెందిన కనై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే దంపతులిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
"ఖరీదైన ఫోన్ కొనమని నా భార్య జ్యోతి అడిగింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అందుకే ఈఎంఐలో మొబైల్ కొన్నా. ఆ విషయం నా భార్యకు తెలియదు. ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి మా ఇంటికి రావడం వల్ల ఈఎంఐలో మొబైల్ తీసుకున్నట్లు నా భార్యకు తెలిసింది. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన నా భార్య ఆత్మహత్యకు పాల్పడింది."
-కనై, మృతురాలి భర్త