Woman Came With Oxygen Cylinder To Complaint : ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ ఎస్పీ కార్యాలయానికి ఓ మహిళ.. ఫిర్యాదు చేయడానికి ఆక్సిజన్ సిలిండర్‌ను వెంటబెట్టుకొని రావడం చర్చనీయాంశమైంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తనకు వస్తున్న బెదిరింపులపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అసలేం జరిగిందంటే?
మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. హజారీబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్‌హర్తోలిలో నివాసం ఉంటున్న అంజనా గుప్త(70)పై శంకర్ అనే వ్యక్తి కొన్నినెలల క్రితం దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు వచ్చిన అంజన కుమార్తెలపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో అంజన తలకు తీవ్రగాయమైంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. అప్పటినుంచి ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే జీవిస్తోంది.
తనపై జరిగిన దాడికి సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవాలని అంజన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఫిర్యాదు చేసి రెండు నెలలు గడిచినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించింది. ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనకు హత్య బెదిరింపులు వస్తున్నట్లు చెప్పింది. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తన భర్తతో కలిసి వచ్చినట్లు తెలిపింది.
"నాకు కుమారులు లేరు. దీంతో నా ఆస్తిని తన పేరు మీద మార్చుకోవాలని నిందితుడు పథకం వేశాడు. అందుకే నన్ను చంపాలని కూడా చూశాడు. స్థానికంగా అతడు ప్లాస్టిక్ వస్తువుల షాప్ నడుపుతున్నాడు. ఎలాంటి భయం లేకుండా వచ్చి దుకాణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. నేను మాత్రం భయంతో బయటకు రాలేకపోతున్నాను. నా కుమార్తెల ప్రాణాలకు కూడా ముప్పు ఉంది" అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
నెమలిపై మహిళ ఫిర్యాదు..
Woman Complaint On Peacock : తనపై నెమలి దాడి చేసిందని ఓ మహిళ అటవీ శాఖ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. ఆమెకు గ్రామస్థులు సైతం మద్దతుగా నిలిచారు. ఈ ఘటన కర్ణాటక.. రామనగర జిల్లాలో జరిగింది. నెమలి.. తన పదునైన ముక్కుతో గాయపరిచిందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. చన్నపట్టణ తాలుకాలోని అరళాలుసంద్ర గ్రామంలో లింగమ్మ అనే మహిళ నివసిస్తోంది. ఆమె ఇంటి ప్రాంగణంలో ఓ నెమలి కొద్ది రోజులుగా సంచరిస్తోంది. అయితే జూన్ 26న లింగమ్మ తన ఇంటి సమీపంలో పని చేస్తుండగా.. నెమలి ఆమెపై దాడి చేసింది. దీంతో లింగమ్మ.. జూన్ 28న నెమలి తనను గాయపరిచిందని అటవీ శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను గాయపరిచిన నెమలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.