మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ సాధారణ యువకుడు అతడు. తన చెల్లి పెళ్లి కోసం డబ్బు సంపాదించాలని క్యాలెండర్ల తయారీ ఫ్యాక్టరీలో పని చేశాడు. పైసా పైసా కూడబెట్టుకుని చెల్లి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఓ అనుకోని పరిస్థితి తన జీవితాన్నే మార్చేసింది. మానసిక స్తిమితం కోల్పోయి, దూరమయ్యాడు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత కోలుకుని, అయిన వారికి చేరువయ్యాడు. తన కొడుకును చూసిన ఆనందంలో అతని తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడ్ని అక్కున చేర్చుకుని కంటతడిపెట్టారు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... అలహాబాద్‌కు చెందిన శిబు యానే ఆయుబ్ అనే వ్యక్తి తన చెల్లి పెళ్లి కోసం డబ్బులు సంపాదించడానికి శివకాశీలో ఓ క్యాలెండర్ తయారీ కంపెనీలో పని చేస్తుండేవాడు. తన చెల్లికి పెళ్లి కుదిరిందనే వార్త తెలిసి ఇంటికి వెళ్లాలనుకున్నారు. కంపెనీ వారిని తన జీతం డబ్బులు, పెళ్లికి సెలవులు అడిగాడు. రెండింటికీ వారు నిరాకరించడం వల్ల మానసిక ఒత్తిడికి గురైన శిబు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయోమయంలో ఓ రైలు ఎక్కగా అది మంగళూరుకు చేరుకుంది. అప్పటికే అతని మానసిక పరిస్థితి క్షిణించింది. ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో అక్కడే వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. ఇది చూసిన వైట్ డవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ అతడ్ని అక్కున చేర్చుకుంది.
ఆ సమయంలో శిబుకు తన పేరు తప్ప ఇంకేం గుర్తులేదు. దాదాపు మూడేళ్లు అతను ఆ పేరు తప్ప మరో మాట చెప్పేవాడు కాదని, చికిత్స పొందాక మునుపటిలా మారాడని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. శిబుకు జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తర్వాత, అలహాబాద్‌లో అతను చదువుకున్న పాఠశాల పేరు చెప్పగలిగాడు. అతడు ఇచ్చిన క్లూ ద్వారా ఆ గురించి స్కూల్ వారు ఆరా తీశారు. శిబు వాళ్ల గ్రామ సర్పంచ్ ద్వారా అతడి తండ్రి ఫోన్ నంబరు కనుగొన్నారు.