తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం' - సంజయ్​ రౌత్​

కాంగ్రెస్​ లేకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​. కాంగ్రెస్​ బలం అవసరమని తెలిపారు. అయితే.. ఇటీవల జరిగిన సమావేశంలో కూటమిపై చర్చించలేదన్నారు. మరోవైపు.. విపక్ష కూటమిపై పవార్​ వ్యాఖ్యలతో ఏకీభవించారు శివసేన నేత సంజయ్​ రౌత్​.

NCP Chief Sharad Pawar
శరద్​ పవార్​, సంజయ్​ రౌత్​

By

Published : Jun 26, 2021, 1:01 PM IST

భాజపాను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు ఏకమవుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​. దిల్లీలో జూన్​ 22న జరిగిన నేషనల్​ ఫోరమ్​ సమావేశంలో థర్డ్​ ఫ్రంట్​ ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడితే.. అందులో కచ్చితంగా కాంగ్రెస్​ ఉండితీరాల్సిందే అన్నారు. కాంగ్రెస్​ను భాగస్వామిగా చేసుకుంటేనే అది పూర్తవుతుందని, అలాంటి బలం మనకు అవసరం ఉందనే విషయాన్ని నేతలతో చర్చించినట్లు చెప్పారు.

పవార్​ నివాసంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ మినహా ఇతర ప్రధాన ప్రతిపక్షాలు మాత్రమే​ హాజరైన నేపథ్యంలో.. కొత్త కూటమిలో ఆ పార్టీకి చోటు లేదనే ఊహాగానాలు వినిపించాయి. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు పవార్​.

"కూటమిపై మేం చర్చించలేదు. కానీ, సంఘటిత నాయకత్వంతో ముందుకు సాగాలనేది నా అభిప్రాయం. కొన్నేళ్లుగా నేను అదే చేస్తున్నా. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండేందుకు, వారికి మార్గనిర్దేశం చేస్తూ బలంగా మార్చేందుకు పని చేస్తా. మహారాష్ట్ర విషయానికి వస్తే.. ప్రతి రాజకీయ పార్టీకి తన బలాన్ని పెంచుకునే హక్కు ఉంటుంది. మా పార్టీ కార్యకర్తలను పెంచుకునేందుకు మేం కూడా అలాంటి ప్రకటనలు చేస్తాం. కాంగ్రెస్​ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటే దానిని స్వాగతిస్తాం."

- శరద్​ పవార్​, ఎన్​సీపీ అధినేత

కాంగ్రెస్​ లేకుండా కూటమి అసంపూర్ణం: రౌత్​

జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోందని, కానీ, కాంగ్రెస్​ లేకుండా ఆ కూటమి అసంపూర్ణమేనని స్పష్టం చేశారు శివసేన నేత సంజయ్​ రౌత్​. ఆ కూటమిలో కాంగ్రెస్​ కీలక పాత్ర పోషిస్తుందని, అధికార భాజపాకు బలమైన ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తుందని తెలిపారు. దిల్లీలోని శరద్​ పవార్​ నివాసంలో టీఎంసీ, ఎస్పీ, ఆప్​, ఆర్​ఎల్​డీ, లెఫ్ట్​ పార్టీలు సమావేశమైన నాలుగు రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:ఏకతాటిపైకి విపక్షాలు.. తృతీయ కూటమి తథ్యమా?

ABOUT THE AUTHOR

...view details