భారత్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు టీకా సరఫరాలో జాప్యం జరగవచ్చని గవీ(గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునేషన్) సీఈఓ సెత్ బెర్క్లే అభిప్రాయపడ్డారు. ఆశించిన దాని కన్నా.. తక్కువ టీకాలే భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. అమెరికాలోని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఎక్కువగా టీకాలు సరఫరా చేస్తోంది. కానీ ప్రస్తుత కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అంటే.. వాళ్లకు మరిన్ని డోసులు కావాలని, ప్రపంచ దేశాలకు తక్కువ డోసులు సరఫరా అవుతాయని అర్థం."
--- సెత్ బెర్క్లే, గవీ సీఈఓ.
మార్చి-ఏప్రిల్లో 9 కోట్ల డోసులు అందుతాయని భావించామని, కానీ ఆ స్థాయిలో టీకాలు అందకపోవచ్చని పేర్కొన్నారు సెత్.