తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కళ తప్పిన యూపీ ఎన్నికలు.. కానరాని రాజకీయ దిగ్గజాలు

UP Election 2022: దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు ఎంతో ప్రముఖమైనవి. అక్కడ తలలు పండిన రాజకీయ నేతలు వేసే వ్యూహా- ప్రతి వ్యూహాలు, ప్రత్యర్థుల ఊహాకందని ఎత్తుగడలు.. రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అంతటి ప్రసిద్ధి గాంచిన యూపీ శాసన సభ ఎన్నికలు ఈసారి కళ తప్పనున్నాయి. దశాబ్దాల పాటు యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నేతల్లో కొందరు మరణించటం, మరికొందరు అనారోగ్య సమస్యలతో ఎన్నికలకు దూరం కావడం ఇందుకు కారణంగా నిలుస్తోంది.

With many political stalwarts gone, UP keen to see how their wards fare at the hustings
యూపీ ఎన్నికల్లో వెలితి.. కానరాని రాజకీయ దిగ్గజాలు

By

Published : Jan 18, 2022, 5:28 AM IST

UP Election 2022: 2017 ఎన్నికలతో పోలిస్తే.. 2022 యూపీ శాసన సభ ఎన్నికల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. యూపీ రాజకీయాలను దశాబ్దాల పాటు ఏలిన.. మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ నేత అజిత్‌ సింగ్‌.. భాజాపా సీనియర్‌ నేత లాల్జీ టండన్‌, సమాజ్‌వాదీ పార్టీ కీలక నేతలు అమర్‌సింగ్‌, బెనీ ప్రసాద్‌ వర్మ సహా.. పలువురు రాజకీయ పండితులు గడిచిన రెండేళ్లలో.. అనారోగ్య సమస్యలతో మరణించారు.

యూపీ ఎన్నికల్లో వెలితి..

అటు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ సైతం.. అనారోగ్య కారణాలతో ఎన్నికల హడావిడి నుంచి దూరంగా ఉంటున్నారు. తమ రాజకీయ చతురతలతో.. ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన వీరంతా.. ప్రస్తుత యూపీ ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల యూపీ రాజకీయాలకు గొప్ప వెలితిగా మారాయి. అయితే.. వారి చరిష్మాను ప్రధాన అస్త్రంగా చేసుకోని దిగ్గజ నేతల వారసులు యూపీ ఎన్నికల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.

కల్యాణ్‌ సింగ్‌ వారసత్వాన్ని..

భాజపాకు యూపీలో ప్రధాన హిందుత్వ నేతగా ఉన్న కల్యాణ్‌ సింగ్‌ గతేడాది ఆగస్టు 21 కన్నుమూశారు. ఆయన యాదవేతర వర్గాలను ఏకీకృతం చేసి.. వారిని భాజపాకు ప్రధాన బలంగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. అంతటి దిగ్గజ నేతగా ఎదిగిన కల్యాణ్‌ సింగ్‌ వారసత్వాన్ని.. ఆయన కుటుంబ సభ్యులు నిలబెట్టుకుంటున్నారు. ఆయన మనవడు సందీప్‌ సింగ్‌ 2017లో అత్రౌలీ అసెంబ్లీ స్థానంలో గెలుపొందగా.. కుమారుడు రజ్‌వీర్‌ సింగ్‌ ఈటా పార్లమెంటు స్థానం నుంచి భాజపా ఎంపీగా ఉన్నారు.

ప్రియతమ నేతకు నివాళులు అర్పించాలని

అటు ఆర్​ఎల్​డీ నేత మాజీ కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ కుమారుడు జయంత్‌ చౌదరీ.. తన తండ్రి బాటలో నడుస్తూ కీలక నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ యూపీ ప్రజల్లో అజిత్‌సింగ్‌కు మంచి పేరు ఉంది. ఈ సారి ఆ ప్రాంతంలో జయంత్‌ చౌదరీని గెలిపించటం ద్వారా తమ ప్రియతమ నేతకు ఘనమైన నివాళులు అర్పించాలని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆర్​ఎల్​డీ.. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోని ఎన్నికల బరిలోకి దిగుతోంది.

తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ..

బిహార్‌ మాజీ గవర్నర్‌, భాజపా యూపీ కీలక నేత లాల్జీ టండన్‌ గతేడాది జులై 21న మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అషుతోష్‌ టండన్‌.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని అశుతోష్‌ ఉవ్విళ్లూరుతున్నారు.

చురుగ్గా అఖిలేశ్‌..

యూపీ రాజకీయాలను శాసించిన నేతల్లో ఒకరైనా ములాయం సింగ్‌ యాదవ్‌ అనారోగ్యంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో ఆయన కుమారుడు అఖిలేశ్‌ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎస్పీలో కీలక నేతలుగా ఎదిగిన అమర్‌ సింగ్‌, బెనీ ప్రసాద్‌ వర్మా గతేడాది మృతి చెందారు. ప్రస్తుతం ప్రసాద్ వర్మా కుమారుడు రాకేశ్‌ వర్మ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ బరాబంకీ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

యూపీలోని రాయ్‌బరేలి నుంచి మరో దిగ్గజ నేతగా ఉన్న అఖిలేశ్‌ సింగ్‌ 2019 ఆగస్టు 20న మృతి చెందగా.. ప్రస్తుతం ఆయన కుమార్తె అదిగి సింగ్‌ ఆ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. గత దశాబ్దాల కాలంగా యూపీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కొందరు కీలక నేతలు కాలం చేయడం వల్ల వారి వారసులు తమ వారి వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు తహతహలాడుతున్నారు.
ఇవీ చూడండి:పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా- కొత్త తేదీ ఇదే...

భాజపా-జేడీయూ మధ్య 'అశోక' వివాదం.. నేతల మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details